జగన్ ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రత్యర్థి వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీ ఘోరంగా విఫలమైంది. వైసీపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, సహజంగానే కొన్ని నిర్ణయాలు కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడేలా చేశాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఈ వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవడంలో టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం తీరుపై తటస్థులు కాసింత ఆగ్రహంగానే ఉన్నారు.
ప్రధానంగా టీడీపీ లాజిక్కులను విడిచిపెట్టి జిమ్మిక్కులను నమ్ముకోవడం వల్లే ఆ పార్టీ రోజురోజుకూ అత్యంత దయనీయ స్థితిలోకి నెట్టబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే… ప్రభుత్వంపై టీడీపీ, ఆ పార్టీని నెత్తిన మోసే ఎల్లో మీడియా చేస్తున్న వాదనలు పేలవంగా ఉన్నాయి. నిన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలు లాజిక్కు నిలబడేలా లేవు.
‘పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వీర్యమై, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఎన్నికలతో వైకాపా పతనం ప్రారంభమైంది. ప్రజలు కన్నెర్ర చేస్తే అధికార పార్టీ నాయకులకు పుట్టగతులుండవు. మంత్రులు జయరాం, విశ్వరూప్‌ల సొంతూళ్లలోను, వైకాపా ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిల సొంతూరు పెదకాకానిలోను వారికి జరిగిన పరాభవనమే దీనికి నిదర్శనం’ అని చంద్రబాబు అన్నారు.
ఉదాహరణకు ఈ రోజు ఓ పత్రికలో ‘ఇద్దరు మంత్రులకు షాక్’ శీర్షికతో ప్రచురించిన వార్తను పరిశీలిద్దాం.
‘పంచాయతీ ఎన్నికలు ఇద్దరు మంత్రులకు షాకిచ్చాయి. కృష్ణా జిల్లాలో నాని స్వగ్రామం యలమర్రు. తూర్పు గోదావరిలో విశ్వరూప్ స్వగ్రామం నడవపల్లిలో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ప్రతిపక్షాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడలో టీడీపీ మద్దతుదారులు గెలిచారు. ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామంలో మాత్రం టీడీపీ ఓడిపోయింది.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కడప జిల్లాలో తన స్వగ్రామం పోట్లదుర్తిలో తన సొంత అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. టీడీపీలో నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి స్వగ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులను గెలిపించుకున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ గెలిచింది’ అని రాసుకొచ్చారు. ఈ కథనంలో వైసీపీ మంత్రుల నియోజకవర్గాలు, స్వస్థలాల్లో గెలుపొందిన వివరాలు కూడా ఉన్నాయి.
అయితే చంద్రబాబు, ఎల్లో మీడియా లాజిక్ మిస్ అవుతూ, ప్రభుత్వంపై పొంతనలేని, పసలేని విమర్శలు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా ప్రభుత్వమే అరాచకాలకు పాల్పడి ఉంటే …ఇద్దరు మంత్రులకు షాక్ ఎలా తగులుతుంది? చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కేఈ కృష్ణమూర్తి స్వగ్రామాల్లో తమ పార్టీ మద్దతుదారులు ఎలా గెలుపొందారో చెప్పాలి? టీడీపీ మద్దతుదారులు గెలుపొందితే మాత్రం వీరోచిత పోరాటాలు, ఇంకా ఏవేవో తెర ముందుకు తెస్తున్నారు.
ఇలాంటి హూందాతనం లేని విమర్శల వల్లే చంద్రబాబు రోజురోజుకూ తనను తాను దిగజార్చుకుంటూ ప్రజల్లో పార్టీని పలుచన చేస్తున్నారనే అభిప్రాయాలు సొంత పార్టీ శ్రేణుల నుంచి వినవస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు, అధికారులను హెచ్చరించడం ద్వారా ప్రజల్లో పరపతి పెంచుకోవచ్చనే జిమ్మిక్కులకు చంద్రబాబు పాల్పడుతున్నారని, ఆయన నడవడిక తెలియజేస్తోంది.
కావున ఇప్పటికైనా ఛీప్ ట్రిక్స్ మాని, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడితే ప్రయోజనం ఉంటుందని గ్రహించాలి. మన పతనానికి మరెవరో కారణం కాదు. మన వ్యక్తిత్వమే మనల్ని అందలం ఎక్కించాలన్నా, అథఃపాతాళానికి తొక్కేయాలన్నా దోహదం చేస్తుందనే నగ్న సత్యాన్ని చంద్రబాబు గ్రహించాల్సి ఉంది.
చంద్రబాబు గురించి చెప్పుకోవాలంటే, నాడు-నేడు అని గత చరిత్ర తవ్వకాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. 20 ఏళ్ల క్రితం హైటెక్ బాబు కాస్త, జగన్ రాజకీయం ముందు వెలవెలబోతున్నారు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు, ఇప్పుడు గల్లీ స్థాయి లీడర్‌గా రూపాంతరం చెందారు. బాబు రాజకీయ చరమాంకం అందలం నుంచి అథఃపాతాళానికి శరవేగంగా సాగుతోందని చెప్పుకోవాల్సి రావడం ఓ విషాదం.