టీడీపీ ఆవిర్భావ వేడుకలో అధినేత చంద్రబాబు ప్రసంగం వింటున్నంత సేపు…అతికినట్టు అబద్ధాలు చెబుతున్నందుకు చప్పట్లు కొట్టాలనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అబద్ధాలు చెబుతున్నప్పుడు, తన పార్టీ శ్నేణుల నుంచి వస్తున్న స్పందన చూస్తూ చంద్రబాబు తప్పక నవ్వుకుని వుంటారు. తానేం చెప్పినా నమ్మే పార్టీ శ్రేణుల అమాయకత్వం నవ్వుకాకుండా మరేం తెప్పిస్తుంది?
అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించామన్నారు. తాను అనుకుంటే… ప్రతిపక్ష వైసీపీ నేతలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేవాళ్లా? అని ప్రశ్నించారు. ఏపీలో సైకో సీఎం ఉన్నారన్నారు. అన్ని వ్యవస్థలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ, శాసనమండలి, ఎన్నికల కమిషన్, హైకోర్టుపై దాడి చేశారని విమర్శించారు. ఇంతకంటే లోకంలో అబద్ధాలు మరేవైనా వుంటాయా? అని జనం ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు అధికారంలో వుండగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు వైసీపీ ఎంపీలను టీడీపీలో చేర్చుకోవడం ప్రజాస్వామ్య బద్ధమా? అలాగే వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమా? నిఘా వ్యవస్థను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల వ్యక్తిగత గోప్యతకు విఘాతం కల్పించడం కూడా ప్రజాస్వామ్యబద్ధమా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వచూపి నేరుగా తన ఎమ్మెల్యే పట్టుబడడం ప్రజాస్వామ్యంలో భాగమా? ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర హక్కును కాలరాయడం ఏ పరిధిలోకి వస్తుంది?
అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని అనవసరంగా తీసుకుని, ఈ రోజుకు కూడా పూర్తిచేయలేని దుస్థితిలోకి నెట్టడం ఏపీలో దాడి చేయడం కిందికి రాదా? తదితర ప్రశ్నలకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు. చేసేవన్నీ తప్పుడు పనులు, చెప్పేది శ్రీరంగ నీతులని చంద్రబాబు నీతులపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
తాను అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా పాలన సాగించడం వల్లే జనం మొట్టికాయలు వేసి మూలన కూచోపెట్టారని చంద్రబాబు గ్రహించకపోవడం ఆయన అంధత్వానికి నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.