తల్లి లాంటి స్థానంలో ఉన్న మీరు చిత్రపరిశ్రమపై పెద్ద మనసుతో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి వేడుకోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ, నటుడు సురేష్ తదితరులు మెగాస్టార్ తన స్థాయిని మరిచి చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని ప్రాథేయపడడం ఏంటని విమర్శలకు పదును పెట్టారు. కార్యసాధకుడైన చిరంజీవి ఆ విధంగా కాకుండా మరెలా చర్చిస్తారనే వాదన లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి సమస్యల్ని సృష్టించి, మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్టు జగన్ బిల్డప్ ఇస్తున్నారని బాబు ఆగ్రహం ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం టీడీపీ వ్యూహ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకని నిలదీశారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయించి, టీడీపీకి సవాల్ విసరడాన్ని చంద్రబాబు పదేపదే గుర్తు చేసుకుంటూ, ఆ పని ఇప్పుడెందుకు చేయడం లేదని నిలదీశారు. ఈ నెల 17న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ చర్చించనున్న పరిస్థితుల్లో ఎజెండాలో ప్రత్యేక హోదా చేర్చడాన్ని తమ ఘనతగా వైసీపీ ప్రచారం చేసుకుందన్నారు.
ఆ తర్వాత ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తొలగిస్తే, దానికి తాను కారణమని బురద జల్లుతారా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై చంద్రబాబు సంచలన విషయాలు చెప్పారు. అసలు టాలీవుడ్‌కు సమస్యలు సృష్టించిందే జగన్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. తద్వారా చిత్ర పరిశ్రమను అవమానించారన్నారు.
స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు చిత్ర పరిశ్రమ సమస్యల్ని పరిష్కరించాలని జగన్‌ని ప్రాధేయపడాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి చేరిన తెలుగు సినిమా పరిశ్రమని జగన్ కించపరిచారని మండిపడ్డారు.