కుప్పానికి నీళ్లు అందించడం గురించి తెలుగుదేశం పార్టీ చాలా ఇదిగా స్పందిస్తూ ఉందిప్పుడు! కుప్పానికి నీళ్లు అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, వాటిని వేగంగా పూర్తి చేసి కుప్పానికి నీళ్లు అందించాలని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు!
చాలా బాధ్యతతో కూడుకున్న పని ఇది. కుప్పానికి నీళ్లు అందించాలని టీడీపీ కార్యకర్తలు చేసే డిమాండ్ చాలా అర్థవంతమైనదే. అయితే.. ఈ డిమాండ్ ను ఇప్పుడు వీరలెవల్లో హైలెట్ చేస్తూ.. తెలుగు తమ్ముళ్లు సభ్యసమాజానికి అందిస్తున్న సందేశం ఏమిటి? అనేది జనాలు ఆలోచిస్తున్న విషయం!
తెలుగుదేశం ధర్నాలు, యాత్రలు.. చూశాకా.. సగటు చిత్తూరు జిల్లా వాసులు ఒక మోటు మాటలో స్పందిస్తూ ఉన్నారు. అది పత్రికల్లో రాయలేని పదజాలమే అయినా, రాయక తప్పడం లేదు. *ఇన్నాళ్లూ ఏం పీకారు?* అని అని తెలుగుదేశం కార్యకర్తలను, కుప్పానికి అర్జెంటుగా నీళ్లు అందేలా పనులు జరగాలని డిమాండ్ చేస్తున్న పచ్చచొక్కాలను ఉద్దేశించి చిత్తూరు జిల్లా జనాలు మోటుగా వ్యాఖ్యానిస్తున్నారు!
ఆ మాటను బూతుగా చూడనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ డ్రామాలతో ఎంతగా విసిగి వేసారి పోతే అలాంటి మాట రావాలి? 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు. అన్ని సంవత్సరాల పాటు ఆయన కుప్పం నుంచినే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి కుప్పం అభివృద్ధి పై పెట్టిన శ్రద్ధ ఏమిటో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు చాటుతున్నారు!
ఒక్క కుప్పం విషయంలోనే కాదు.. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు చూపిన శ్రద్ధ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపన జరిగి, దాదాపు కాలువల ప్లాన్ కూడా అప్పటికే రెడీ అయిన హంద్రీనీవా ప్రాజెక్టుకు తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఒకటి కాదు రెండు కాదు.. తొమ్మిదేళ్ల అధికార కాలంలో తొమ్మిది అడుగుల కాలువైనా తవ్వారా?
వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకా హంద్రీనీవా ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. మ్యాపుల్లో కాస్త మార్పులతో అనంతపురం జిల్లా చివరి వరకూ హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి.
గొల్లపల్లి డ్యామ్ పనుల్లో కూడా 90 శాతం పనులు వైఎస్ హయాంలో పూర్తయ్యాయి. సరిగ్గా ఆ డ్యామ్ కు నీళ్లు అందించే పరిస్థితి వచ్చే సమయానికి చంద్రబాబు సీఎం అయ్యారు. అదంతా తన ఘనతే అని ప్రచారం చేసుకున్నారు. ఆ సిగ్గుమాలిన తనాన్ని సీమ జనాలు ఒక రేంజ్ లో ఛీత్కరించుకున్నారు.
ఒకవైపు గొల్లపల్లి అవతల కూడా వైఎస్ హయాంలోనే కాలువ పనులు మొదలయ్యాయి, కిరణ్ హయాంలో అక్కడ కాలువలు ఒక రూపుకు వచ్చాయి. అక్కడ నుంచి సరిగ్గా నలభై యాభై కిలోమీటర్ల అవతల నుంచి చిత్తూరు జిల్లా ప్రారంభం.
ఒకేసారి సమాంతరంగా అన్ని చోట్లా పనుల ప్రారంభం జరిగింది. చిత్తూరు జిల్లాలోనూ వైఎస్ హయాంలోనే పనులు ప్రారంభం అయ్యాయి. అయితే అవి మొదటి నుంచి లేట్ అవుతూ వచ్చాయి.
అనంతపురం జిల్లా గొల్లపల్లి వరకూ నీళ్లు తీసుకొచ్చేందుకు వైఎస్ హయాంలోనే లైన్ క్లియర్ అయితే.. కనీసం అక్కడ నుంచి మిగతా కాలువల పని కూడా కొంత వరకూ పూర్తి అయినా, చంద్రబాబు నాయుడు ఐదేళ్ల కాలంలో తన సొంత జిల్లా, తన సొంత నియోజకవర్గం వరకూ నీటిని తీసుకెళ్లలేకపోయారు.
అలాంటి వాళ్లు ఇప్పుడు హంద్రీనీవా ప్రాజెక్టు గురించి ఆందోళనలు, ధర్నాలు! అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే! .
ఇలాంటి ధర్నాలు తెలుగుదేశం ఎందుకు చేస్తున్నట్టు? అంటే.. చంద్రబాబు నాయుడి చేతగాని తనాన్ని, అసమర్థతను, రాయలసీమపై ఆయనకున్న నిర్లక్ష్యాన్ని హైలెట్ చేయడానికనమాట!
సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే పనులు చేయకుండా, 14 యేళ్ల పాటు సీఎం హోదాలో కొనసాగి.. ఇప్పుడు ధర్నాలు చేయిస్తూ చంద్రబాబు నాయుడు తన అసమర్థతపై అందరూ స్పందించేలా చేస్తూ ఉన్నారు.
తాము ఏ డ్రామా అడినా దాని ద్వారా పొలిటికల్ మైలేజ్ వచ్చేస్తుందనే అర్థం లేని లెక్కలతోనే చంద్రబాబు నాయుడు ఇంకా కొనసాగుతున్నారనేందుకు ఇది కూడా మరో రుజువు. ఈ తరహా రాజకీయానికి కాలం చెల్లిపోయిందని స్పష్టం అవుతున్నా చంద్రబాబు నాయుడు తన పాత స్కూళ్లోనే సాగుతున్నారు! తమ్ముళ్లను ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు!