సీమలో టీడీపీ.. నిర్వేదంగా, నిస్తేజంగా, నిర్వీర్యంగా!

ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నిక‌లు తెచ్చేలా ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కూడా స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గాలంటూ టీడీపీ ప‌ట్ట‌బ‌డుతూ ఉంది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న‌ప్పుడు స్థానిక‌లు నిర్వ‌హించ‌డానికి వైఎస్ఆర్…

ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నిక‌లు తెచ్చేలా ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కూడా స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గాలంటూ టీడీపీ ప‌ట్ట‌బ‌డుతూ ఉంది. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న‌ప్పుడు స్థానిక‌లు నిర్వ‌హించ‌డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం సానుకూలంగా లేద‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. 

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ నిష్పాక్షింగా ఉండే అవ‌కాశ‌మే లేద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఒక‌వేళ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎస్ఈసీ ప‌ట్టుబ‌ట్టినా.. తాము సుప్రీం కోర్టు వ‌ర‌కూ అయినా వెళ్లే ఉద్దేశం ఉన్న‌ట్టుగా ఆయ‌న తేల్చి చెప్పారు. 

ఎలాగూ కోర్టుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క‌లిసొచ్చేదేమీ లేదు కాబ‌ట్టి.. టీడీపీ ప‌ట్టుబ‌ట్టిన‌ట్టుగా స్థానిక ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి వ‌చ్చినా.. అప్పుడు టీడీపీ వీర‌విహారం ఏమైనా చేస్తుందా? అనేది కీల‌క‌మైన అంశం.

ఎన్నిక‌లు ఆగ‌డం, జ‌ర‌గ‌డం అంతా తెలుగుదేశం పార్టీ ఆస‌క్తి మేర‌కే జ‌రిగినా.. తెలుగుదేశం వ‌ద్ద‌నుకున్న‌ప్పుడు ఎన్నిక‌లు ఆగి, టీడీపీ కావాల‌నుకున్న‌ప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం టీడీపీ క్యాడ‌ర్ అదేం ఉత్సాహం తెచ్చే అంశం కాద‌ని స్ప‌ష్టం అవుతోంది.

రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల్లో ప‌రిస్థితినే గ‌మ‌నిస్తే.. అక్క‌డ పెద్ద పెద్ద నాయ‌కులు కూడా నిస్తేజంగా క‌నిపిస్తూ ఉన్నారు. ఎవ‌రికి వారికి సొంత వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకోవ‌డం కూడా సాధ్యం కావ‌డం లేదు. 

ఇలాంటి న‌పేథ్యంలో స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించేంత పెద్ద బాధ్య‌త‌ల‌ను తీసుకోవ‌డానికి నేత‌లెవ‌రూ అంత దూకుడుగా ముందుకు వ‌చ్చే ప‌రిస్థితే క‌న‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ద‌శాబ్దాలుగా రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం పార్టీకి కొన్ని కంచుకోట‌లున్నాయి, అలాగే గ‌త ఐదేళ్ల ట‌ర్మ్ లో చంద్ర‌బాబు నాయుడు రాయ‌ల‌సీమలో కుక్క‌కు కూడా కండువాలు వేశారు! వాళ్లూ, వీళ్లూ తేడా లేకుండా..అంద‌రినీ చేర్చుకున్నారు. ఇలాంటి వారిలో కొన్ని ఇంగువ‌క‌ట్టిన గుడ్డ‌లున్నాయి. వాళ్ల పేర్లు అయితే పెద్ద‌వి కానీ,  ఇప్పుడు ఊరు దిబ్బ‌గా మారింది ప‌రిస్థితి.

స్థానిక ఎన్నిక‌లంటే.. అవంతా చాలా వ‌ర‌కూ నేత‌ల పేర్ల మీదే రాజ‌కీయం సాగుతుంది. క్రితం సారి స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ ర‌కంగా రాజ‌కీయం చేసిందో ఎవ‌రూ మ‌రిచిపోలేని అంశం! .

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అనేక మంది మున్సిప‌ల్ వార్డు మెంబ‌ర్ల‌ను,కార్పొరేష‌న్ స‌భ్యుల‌ను, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స‌భ్యుల‌ను… తెలుగుదేశం పార్టీ త‌న వారిగా చెప్పుకుంది. కొన్ని జిల్లాల్లో జ‌డ్పీ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చినా వాటిల్లో చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను మాత్రం తెలుగుదేశం సొంతం చేసుకుంది!

మున్సిప‌ల్ చైర్మ‌న్ల ఎన్నిక‌, జ‌డ్పీ చైర్మ‌న్ల ఎన్నిక‌, ఎంపీపీల ఎన్నిక మొత్తం ప్ర‌హ‌స‌నంగా సాగింది. గెలిచిన వారందరూ త‌న వారే అన్న‌ట్టుగా టీడీపీ రాజ‌కీయం సాగింది. అదీ తెలుగుదేశం పార్టీ ప్ర‌జాస్వామ్యానికి ఇచ్చిన విలువ‌.

తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడ‌టం, త‌మ చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు మాత్రం అడ్డ‌గోలుగా ర‌చ్చ చేయ‌డం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచిన వారిని తిప్పుకోవ‌డాలు, అంత‌కు ముందే నామినేష‌న్ల‌ను విత్ డ్రా చేయించ‌డాలు, ఇవ‌న్నీ రాయ‌ల‌సీమ‌లో టీడీపీ అమ‌లు చేసిన రాజ‌కీయ వ్యూహాలే! అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవ‌న్నీ జ‌నాలు మ‌రిచిపోయిన‌ట్టుగా శుద్ధ‌పూస‌లాగా స్పందిస్తూ ఉంది!

అయినా రెండుక‌ళ్ల సిద్ధాంతాలు టీడీపీకి కొత్త‌వేమీ కావు. ఆ ప‌రంప‌ర‌లోనే ఇప్పుడు కూడా ఆ పార్టీ స్పందిస్తోంది. అయితే.. ఇప్పుడు అస‌లు సంగ‌తేమిటంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప‌రిధిలో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను తీసుకునే నేత‌లే క‌నిపించ‌డం లేదు!.

టీడీపీ కంచుకోట‌ల్లో.. కూడా మాజీ ఎమ్మెల్యే హోదాల్లోని వారు, మాజీ మంత్రుల హోదాల్లోని వారు.. కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ ప‌రిచి, ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పార్టీని గెలిపించుకుని, నిలిపించుకునే ఆస‌క్తితో  పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

ఇదంతా చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎన్నిక‌ల‌ను తెచ్చుకుని, చిత్తు కావ‌డానికి రెడీ అవుతున్న‌ట్టుగా ఉందనేది ప‌రిశీల‌కుల మాట‌.

నన్ను పార్టీనుంచి బైటకు పంపట్లేదు