పోలీసులు లాఠీ పట్టుకుంటేనే ఆంధ్రలో వార్త.
పోలీసులు తుపాకీ పట్టుకున్నా వార్త కాదు పక్క రాష్ట్రంలో.
ఇదీ మన తెలుగునాట ఒక మీడియా తీరు. అలాంటి మీడియా వున్నట్లుండి తాను ఇన్నాళ్లూ వార్తలుగా రాయలేనివి అన్నీ గుదిగుచ్చి, వ్యాసంగా మార్చి, కాస్త పరుషపు పలుకులు లేకుండా జాగ్రత్తపడుతూ, ఇంటి పెద్దకు సలహా సూచలనలు అన్నట్లుగా వ్యాసం వండి వార్చింది.
తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా పోలీసులు గీత దాటారన్నది ఒక పాయింట్. ఇళ్లలో డబ్బులు పెద్ద మొత్తంలో నిల్వ చేస్తే సోదా చేయాల్సింది ఆదాయపన్ను శాఖ తప్ప పోలీసులు కాదు.
అలా దొరికిన డబ్బును మీడియా ముందు ప్రదర్శనకు పెట్టడం, అలా డబ్బు ఉంచుకున్నవారిని మీడియా ముందు నేరస్థుల్లా నిల్చోపెట్టడం అరాచకం. పైగా ఎన్నికల కోడ్ అమలులో లేని చోట్ల కూడా ఇళ్లపై పోలీసు దాడులు, నగదు స్వాధీనం ఏమిటి? ఇవన్నీ కోర్టుకు వెళ్తే పోలీసులు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు.
ఇదో పాయింట్
ప్రభుత్వ ధనం నగదు రూపంలో జనాలకు పంచేయడం, అది కూడా పార్టీ జనాల చేతుల మీదుగా పంచేయడం, దానికి ఓ లెక్కా పత్రం లేకపోవడం, అందులో అవకతవకలు ఇతరత్రా వ్యవహారాలు
ఇది మరో పాయింట్.
అసలు అటు ఇటు కాకుండా వున్న భాజపాను ప్రధాన ప్రత్యర్థిని చేసుకున్నది తెరాస నే. భాజపాకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, హడావుడి చేయడం ద్వారా అనవసరంగా అదే పెద్ద పోటీ దారు అనే విషయం చెప్పకనే చెప్పి, ఆ పార్టీ స్థాయి పెంచారన్నది మరొ అదనపు పాయింట్.
ఇలాంటి పాయింట్లు అన్నీ నిజానికి ఇప్పుడు రాయాల్సినవి కాదు. ఆయా సంఘటనలు జరిగినపుడు వార్తలుగా రాయాల్సినవి. కానీ అలా చేయలేదు? ఎందుకని? అప్పుడు రాస్తే జనం ఆలోచించడం మొదలుపెడతారు. ఎన్నికల్లో తెరాస విజయావకాశాలు ప్రభావితం అవుతాయి. అందుకే ఇన్నాళ్లూ ఊరుకున్నారు.
ఇప్పుడు ఇక రాసినా, రాయకపోయినా ఒకటే. దాని వల్ల ఒరిగేది ఏమీ లేదు. రాసుకుంటే రాసుకోండి అని తెరాస అధినేతలు అనుకుంటారు. మన తరపున ఇఫ్పడయినా నాలుగుముక్కలు రాసారు అని భాజపా నేతలు అనుకుంటారు. తామేమీ ఆంధ్రలో రెచ్చిపోయినట్లు తెలంగాణ లో రాయడం లేదని ఎవరన్నా, ఇదిగో రాసాముగా అని చెప్పడానిక ఓ సాక్ష్యంగానూ పనికి వస్తుంది.
అంతకు మించి ఈ పలుకులకు పరమార్థం లేదు. ప్రయోజనం లేదు. ఎందుకంటే సమయానికి లేని బాజా ప్రయోజనం ఏమిటి? అని వెనకటికి మన పెద్దలు అననే అన్నారుగా.