2021 ముగింపుకొస్తోంది. ఈ ఏడు సుప్రసిద్ధమైన వీడియో క్లిపింగ్ ఏమిటని అడిగితే “చంద్రబాబు గారి ఏడుపు” వీడియోనే అని చెప్పాలి.
సానుభూతి రాకపోగా ట్రోలింగులకి ఉపయోగపడేలా తయారయింది ఆ వీడియో. బ్రహ్మానందం బిట్లుని సోషల్ మీడియాలో వాడుతున్నట్టు ఈ ఒక్క చంద్రబాబు గారి ఏడుపు బిట్టుని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం మొదలెట్టేసారు.
సొంత పార్టీ జనాలు ఆయన్ని ఓదార్చలేదు, అలాగని ఏడిపించినవారి మీద తగిన మోతాదులో ఎదురుతిరగలేదు. ఆ మౌనం చంద్రబాబుని మరింత బాధించి ఉండొచ్చు.
ఆ ఎపిసోడ్ అలా పక్కన పెడితే ఇప్పుడాయన మళ్లీ కొత్త ఏడుపు అందుకున్నారు. అయితే ఈ సారి గుక్కపెట్టి ఏడవడం కాదు, కుళ్లుపుట్టి ఎడవడం అన్నమాట.
జగన్ మోహన్ రెడ్డి కంటే ముందు తాను చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరదప్రాంతాల సందర్శనార్థం వెళ్లారు చంద్రబాబు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ ఎందుకో జనం ఆయన్ని అంతగా రిసీవ్ చేసుకోలేదు. ఈయన కూడా వాళ్ల బాధలు వినడం కంటే అసెంబ్లీలో తనకి జరిగిన అవమానాన్ని ఎక్కువగా చెప్పుకున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి ప్రమాణస్వీకారానికి ఎంత స్పందన వచ్చిందో ఈ చంద్రబాబు పర్యటనకి అంతొచ్చింది. సొంత పత్రికలు తప్ప ఎవ్వడూ పట్టించుకోలేదు ఆయన గోలని.
ఇక అసెంబ్లీ సమావేశాలు అనంతరం జగన్ మోహన్ రెడ్డి అవే ప్రాంతాలకి వెళ్లారు. అమరేంద్ర బాహుబలిని చూసి మురిసిపోయినట్టు జనం ఆత్మీయంగా స్వాగతించారు. కొందరు నవ్వుతూ పలకరించారు. నుడిటి మీద ముద్దులు పెట్టారు.
అంతటి బాధలోనూ వాళ్లు జగన్ ని అలా రిసీవ్ చేసుకోవడం భల్లాలదేవుడికి…అదే మన చంద్రబాబుకి కడుపులో మండిపోయింది. కనీసం లౌక్యం కూడా చూపకుండా కుండ బద్దలకొట్టినట్టు తన కుళ్లుని బయట పెడుతూ విడ్డూరంగా ప్రజల్ని తిట్టిపోసారు. అసలా ప్రజలకే బుద్ధి, జ్ఞానం, సంస్కారం లేవన్నారు.
గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి జనంలోకి రావడం మానేసారని పెద్ద అపవాదు ఒకటి ప్రచారం చేసారు ఆ మధ్య. కానీ పదవి లేని ప్రతిపక్షనాయకుడు జనంలో తిరగాలి. ఎందుకంటే అతనికి యంత్రాంగం, బలగం, వ్యవస్థ ఏవీ ఉండవు. కానీ ముఖ్యమంత్రికి అలా కాదు. మొత్తం వ్యవస్థ గుప్పెట్లో ఉంటుంది. వాళ్లతో పని చెయ్యించాల్సిన బాధ్యత మాత్రమే ముఖ్యమంత్రి తీసుకోవాలి. అంతే కానీ ఎన్నికల ముందు పాదయాత్రలాగ గెలిచిన ముఖ్యమంత్రి ఐదేళ్లూ పాదయాత్ర చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.
ఎల్జీ పాలిమర్స్ ఉపద్రవం అప్పుడు, ప్రస్తుత వరదల సమయంలోనూ..అలాగే తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకి ముఖ్యమంత్రి దగ్గరుండి చూసుకుంటున్నాడన్న భరోసా కల్పించడానికి తిరగారు.
చాలాకాలం తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. కొందరిని చూస్తే జనానికి ప్రేమ తన్నుకొస్తుంది. కొందరిని చూస్తే తన్నబుద్ధేస్తుంది. ఎందుకంటే ఏం చెప్పగలం?
చంద్రబాబుకి తత్వం అస్సలు బోధపడట్లేదు. ఒక పక్కన పచ్చ మీడియా వేరే స్టోరీ రాసుకుని ఉండొచ్చు. జగన్ జనక్షేత్రంలోకి వెళ్లగానే ప్రజలు తిట్టిపోసారని ఒక గోబెల్స్ కథనం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ చంద్రబాబు అక్కసుతో నిజం చెప్పేసి దాని మీద నీళ్లు జల్లేసారు. సాక్షాత్తు చంద్రబాబే ప్రజలు జగన్ ని ఆత్మీయంగా స్వాగతిస్తున్నారని ఒప్పేసుకున్నాక ఇంకేం వక్రకథనం రాస్తారు పాపం పచ్చ తమ్ముళ్లు?
మురికివాడల్లోని జనంతో మమేకమవుతూ, పూరి గుడెసెల్లో పేద తల్లులు చేత్తో కలిపి పెట్టే పెరుగన్నాలు తింటూ, వాళ్ల చెమట ఒంటిని ఆలింగనం చేసుకుంటూ, కుష్టు రోగులను కౌగిలించుకుంటూ, వాళ్లు ముద్దులు పెడితే పెట్టించుకుంటూ…సగటు మనిషి “అసహ్యం” అనుకునే ఎన్నో పనులు చిరునవ్వుతో చేసే వాడు ఎలా కనిపిస్తాడు వాళ్లకి? చంద్రబాబు ఎద్దేవా చేయడానికి వాడిన పదమే అయినా, “జీసస్” లాగానే కనిపిస్తాడు కదా!
మరి చంద్రబాబు అలా కాదే! ఆయనవన్నీ హైటెక్ ఆలోచనలు. చుట్టూ ఎస్పీజీ కమెండోలని పెట్టుకుని, రాజకీయ పొత్తులతోటీ, జనాన్ని కాకుండా రెండు పత్రికల్ని నాలుగు ఛానల్స్ ని నమ్ముకుని చేసే రాజకీయం.
ఎంత తేడా ఉంది ఇద్దరికీ?
ఈ సత్యం తలకెక్కించుకోకుండా చంద్రబాబు కుళ్లు ఏడుపు ఏడవడం నిజంగానే ఏడిసినట్టుంది. జగన్ మీద కోపాన్ని ప్రజల మీద తీర్చుకుంటూ తిట్టిన తిట్లు వింటుంటే ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది.
వల్లభనేని వంశీ చెప్పినట్టు ఎలా చూసుకున్నా తెదేపాకి తిలోదాకాలు ఇచ్చేసినట్టున్నారు ప్రజలు. చంద్రబాబు తర్వాత సంగతి పక్కనపెడితే…అసలాయన ఉండగానే పార్టీని పాడెక్కించేసారు.
2019 నుంచి 2021 వరకు వచ్చిన రకరకాల ఎన్నికల ఫలితాలు, ప్రస్తుతం వరద బాధితులు జగన్ పై చూపించిన ప్రేమ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల ఫలితాలు కూడా ఎలా ఉంటాయో కనిపిస్తున్నట్టుంది బాబు గారికి.
ఏం చెయ్యాలో పాలుపోక, ఏ ఎత్తుగడా తట్టక, యుద్ధంలో అస్త్రాల మంత్రాలు గుర్తుకురాని శాపగ్రస్థుడైన కర్ణుడిలాగ మట్టిలో కూరుకుపోయిన సైకిల్ చక్రాన్ని పట్టుకుని ఆయాసపడుతున్నారు చంద్రబాబు.
– హరగోపాల్ సూరపనేని