ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపు కోవడం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులకు కొత్తకాదు. తమ పేరు వింటే భయపడే పాలకుల్ని చూస్తే… ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తాజాగా విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మారాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకుల ఉడత ఊపులకు ఎవరూ భయపడడం లేదు.
ఒక రాజకీయ నాయకుడిగా ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఏంటి? ఆయన మాటలు వింటే హెచ్చరికల్లా లేవు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయాల్సిందే. ఒకవైపు సంక్షేమ పథకాలకు ముందూవెనకా ఆలోచించకుండా డబ్బు పంచుతున్న జగన్, అదే రీతిలో ఉద్యోగులకు కనీసం ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోవడం క్షమించరాని నేరం. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండక్కర్లేదు.
ఇదే సమయంలో ఉద్యోగుల డిమాండ్లకు ప్రజల నుంచి మద్దతు లభించకపోగా, వ్యతిరేకత వస్తోంది. ఎంతసేపూ ప్రభుత్వం, ప్రజల తమ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు మాత్రమే ఉన్నట్టు ఉద్యోగులు వ్యవహరించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏదైనా పనిపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్న సామాన్య ప్రజానీకానికి అందిస్తున్న సేవల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వ కార్యాలయ గుమాస్తా మొదలుకుని, ఉన్నతాధికారి వరకూ లంచం ఇవ్వనందే ఏ పనీ జరగని దుస్థితి.
రైతుకు పట్టాదారు పాసుపుస్తకం కావాలంటే వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్ వరకూ అడుగడుగునా లంచాలు ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వందే ఫైల్ కదులుతుందని ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలడా? అలాగే ఉపాధ్యాయుల విషయానికి వస్తే… రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇన్స్యూరెన్స్ పాలసీలు , వడ్డీల వ్యాపారాలు ఇలా అన్నింటిలోనూ వారే కనిపిస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే బడి, చదువు అని ఆలోచించేది.
ఏపీ ఎన్జీవోల అంతర్గత సమావేశంలో బండి శ్రీనివాసరావు బ్లాక్ మెయిల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం.
‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య, భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. నిలబెట్టొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే’
ఏమిటీ అహంకారం? మరి మిగిలిన కోట్లాది మంది ప్రజల మాటేమిటి? 13 లక్షల మంది ఉద్యోగుల ప్రభుత్వాన్ని కూల్చే లేదా నిలబెట్టే శక్తిమంతులైనప్పుడు, తమరే ప్రభుత్వంగా ఏర్పడి మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవచ్చు కదా? ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి అడుగు పెడితే చాలు… దోచుకోడానికి , పని చేయకుండా ఉండడానికి లైసెన్స్ దక్కినంత ఆనందం.
‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం. అందుకే మీరు మా వంక చూడట్లేదు’ అని బండి మాట్లాడ్డం రాజకీయం కాదా? ఉద్యోగ సంఘాల నాయకుల రాజకీయ ఎజెండాకు ఉద్యోగులను బలి చేయడం ఎందుకు? గతంలో పరచూరి అశోక్‌బాబు ఏ విధంగా ఉద్యోగులను చంద్రబాబు ప్రయోజనాలకు బలి పెట్టారో అందరికీ తెలిసిందే.
ప్రభుత్వోద్యోగులంటే ఓ గౌరవం ఉండేదని ఉద్యోగ సంఘాల నాయకులు తమకు తాము చెప్పుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి. న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాడండి. ఇదే సందర్భంలో ప్రజలకు సేవలందించేందుకు పది శాతమైనా నిబద్ధత చూపాలనే డిమాండ్లు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఆ దిశగా కూడా ఆలోచించండి. లంచాలు తీసుకోకుండా ప్రజలకు సేవలందించాలని ఉద్యోగులకు సంబంధిత సంఘాల నాయకులు హితబోధ చేయాలి.