ప్రతి సోమవారం పోలవరం అన్నారు.. అదిగో అయిపోయింది, ఇదిగో నిర్మాణం పూర్తయ్యిందని హడావుడి చేశారు. రాసుకో.. రాసుకో.. అన్నారు. చివరకు గీసుకోవడానికి కూడా ఏం మిగల్లేదు! ఇప్పుడు మరో కథ ప్రారంభం అవుతూ ఉంది. ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఒకటి తగులుతూ ఉంది. పోలవరం పై ఒరిస్సా ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు పనులను నిలిపి వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు కూడా విచారణకు తీసుకుంది! ఇప్పుడు పోలవరం మళ్లీ అంతరాష్ట్ర సమస్యగా మారేలా ఉంది. పనులు ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకన్నా ఏపీకి షాక్ ఉండదు. ఇంతకీ అసలు కథ ఏమిటో తెలుసుకోవాలంటే..ఇది చదవాలి!
సింపుల్ గా చెప్పాలంటే.. ఏదైనా భారీ ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు నిర్వాసితులు, ఆ ప్రాజెక్టు వల్ల భూములు, ఇళ్లను కోల్పోయే వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. వారి పరిహారాలు, వారికి పునరావస కల్పన వంటి విషయంలో ఆ ప్రాజెక్టును చేపట్టే వాళ్లు సెటిల్ చేయాలి. పోలవరం ప్రాజెక్టు అత్యంత భారీ ప్రాజెక్టు. దీని వల్ల నిర్వాసితులు అయ్యే వారికి, భూ సేకరణకు భారీ మొత్తమే ఖర్చు అవుతూ ఉంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 51,424 కోట్లు అవుతందని భావిస్తుండగా అందులో భూసేకరణ, ఆర్ఆర్ పనులకు 32,509 కోట్లు వ్యయం చేయాలి. పోలవరంలో నిర్మాణ పనులకన్నా వాటికే ఎక్కువ వ్యయం చేయాలి! 2013లో అములోకి వచ్చిన ఆర్ఆర్ చట్టం పటిష్టమైనది. ఇందులో ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయేవారికి, ముంపు బాధితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఒకవైపు నిర్మాణ పనులు, మరోవైపు నిర్వాసితుల పనులు.. రెండూ ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టాలి. అయితే చంద్రబాబు హయాంలో నిర్వాసితుల సంగతి పట్టించుకోలేదు. నిర్మాణ పనుల చాలన్నట్టుగా వ్యవహరించారు. ఎందుకంటే.. నిర్మాణ పనులతో కాంట్రాక్టులు, కమిషన్లు దండిగా వస్తాయి. తీరా గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వారిలో ఒరిస్సా ప్రజలు ఉన్నారు. వారి తరఫున అక్కడి ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. నిర్వాసితులను సరిగా పట్టించుకోకపోవడంతో… ఈ ప్రాజెక్టునే ఆపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరుతూ ఉంది.
ఇలాంటి ప్రాజెక్టును చేపట్టినప్పుడు ముందుగా.. స్పిల్ వే పనులు చేపడతారు. అయితే చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యామ్ పనులు చేసేసి,మొత్తం అయిపోయిందని ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం మరోటి కూడా జరిగింది. అది కూడా ఇప్పుడు మరో ఉత్పాతానికి కారణం అవుతోందని సమాచరాం. కాఫర్ డ్యామ్ ను నిర్మాణం చేపట్టి, స్పిల్ వేను విస్మరించడంతో వరద ప్రభావం ఎక్కువైందని, దీంతో నిర్వాసితులు ఇక్కట్లు పడ్డారని.. చంద్రబాబు నాయుడు అతి తెలివికి పోయి ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేసి, ఇప్పుడు పోలవరానికి పెను శాపానికి కారణం అవుతున్నారని తెలుస్తోంది.
గత ఏడాది వర్షాకాలంలో గోదావరికి భారీ వరదలు సంభవించాయి. అప్పుడు పనులు నిలిచిపోవడమే కాకుండా భారీ స్థాయిలో ముంపు సమస్య ఎగువ భాగంలో తలెత్తింది. దీనివల్ల జనవరి వరకూ కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన వర్క్స్ స్పేస్ లేకుండా పోయింది. అదే సమయంలో నిర్మాణ పనులకు అవసరమైన మౌళిక వసతులు ముఖ్యంగా రహదారులు వంటివి కొట్టుకుపోయాయి. వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ప్రధాన పనులన్నీ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మొత్తం జూన్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
పోలవరం పనులు ఆగిపోయాయని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తూ ఉంది. అయితే పనులేమీ ఆగిపోలేదు. మరో విషయం ఏమిటంటే.. స్పిల్ వే పనులను పూర్తిగా విస్మరించి, కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లనే వరద నీరు ఎక్కువ కాలం అక్కడే నిలబడిపోవడం జరుగుతూ ఉంది. ఏ మాత్రం ప్రణాళిక లేకుండా, కేవలం ప్రజలను భ్రమింపజేయడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం అంటూ డ్రామాలు నడిపారు. ఆ ప్రణాళిక రాహిత్యం ఇప్పుడు పోలవరానికి మరో పెను ప్రమాదంగా మారినట్టుగా ఉంది. మరి వీటన్నింటిపై ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది! మరి తను చేసిన పనులు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు కొత్త గండాలుగా మారడం పై చంద్రబాబు హ్యాపీగా ఉండవచ్చు! జగన్ ను విమర్శించడానికి మరో అస్త్రం దొరికి ఉందని పచ్చ వర్గాలు తమను తామే మెచ్చుకోవచ్చు.