నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా వంట గ్యాస్ ధరలు భారీగా పెంచింది. అదే సమయంలో వంట గ్యాస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీని కూడా భారీగా పెంచింది. ఒకే సమయంలో అటు ధరను ఇటు రాయితీని అంతగా పెంచాల్సిన అవసరం ఏమిటి? ధరణి స్వల్పంగా పెంచితే సరిపోతుంది కదా? అనే అనుమానం సాధారణంగా ప్రజలకు కలుగుతుంది. ఇందులోనే ఉంది అసలు కిటుకు. గుట్టుచప్పుడు కాకుండా ప్రజల నడ్డి విరచడానికి ఇది ఒక మెట్టు మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
స్థూలంగా చూసినప్పుడు మోడీ సర్కార్ వంట గ్యాస్ సిలిండర్ పై కేవలం 30 రూపాయలు మాత్రమే ధర పెంచినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇందులో చాలా ఉంది. గృహ అవసరాలకు వాడుకుని వంటగ్యాస్ ధరను ప్రభుత్వం ఏకంగా 148 రూపాయలు పెంచింది. మోడీ తొలిసారి గద్దె ఎక్కినప్పటినుంచి ఇంత భారీగా పెంచడం ఎన్నడూ జరగలేదు. ధర తో పాటు ఉ వినియోగదారుడికి ఇచ్చే రాయితీలు కూడా ప్రభుత్వం పెంచింది. రాయితీ లో 118 రూపాయలను పెంచారు.
ఇలా ధర -రాయితీ రెండూ పెంచే బదులుగా, ధరణి కేవలం 30 రూపాయలు పెంచితే సరిపోతుంది కదా అనే సందేహం రావచ్చు గాని మోడీ సర్కార్ అలా చేయలేదు. ఎందుకంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ రాయితీని త్యాగం చేయాల్సిందిగా పిలుపు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఇప్పుడు వారందరికీ కూడా 148 రూపాయలు పెంపు వర్తిస్తుంది. ఆ రకంగా పెట్రోలియం ఉత్పత్తుల సంస్థలకు పుష్కలంగా లాభాలు వస్తాయి.
రెండో అంశం ఏమిటంటే.. కొంతకాలం గడిచిన తరువాత ప్రభుత్వం ఏకమొత్తంగా రాయితీలను తొలగించే ఆలోచనతో ఉంది. ఇప్పుడు 30 రూపాయలు గానే కనిపిస్తున్నప్పటికీ, ఏదో ఒక నాటికి ఉన్నపళంగా ఈ మొత్తం 148 రూపాయల భారం వినియోగదారుడిపై పడక తప్పదు. అంటే ఒకే సారి మోపితే… ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉన్నది గనుక… మోడీ సర్కారు దశలవారీగా వినియోగదారుడి నడ్డి విరచడానికి పూనుకున్నట్లుగా కనిపిస్తోంది.