అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండోరోజు టీడీపీ పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. అసలుకే మోసం వచ్చింది. ఈ పరిణామాలను టీడీపీ అసలు వూహించలేదు. ఎప్పుడూ చనిపోయిన మాజీ మంత్రి మాధవరెడ్డి ఇవాళ చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణకు కారణమవుతారని ఏ ఒక్కరూ ఊహించి వుండరు.
తామొకటి అంటే ఎదుటి వాళ్లు పది మాటలంటారనే కనీస స్పృహ కూడా లేకుండా టీడీపీ నేతలు వ్యవహరించి, చివరికి చంద్రబాబును అభాసుపాలు చేశారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ దివంగతులైన మాజీ మంత్రి మాధవరెడ్డి ఏ లోకాన ఉన్నారో బాబును మాత్రం నీడలా వెంటాడుతూనే వున్నారు.
ప్రత్యర్థులను గౌరవించకపోతే చివరికి ఏమవుతుందో చంద్రబాబుకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చి వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. బాబాయ్‌పై గొడ్డలి వేటు, గంట, అరగంట అంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యాఖ్యలే చంద్రబాబుపై రివర్స్ అటాక్ చేశాయి. ఇటీవల అంబటి రాంబాబుపై సోషల్ మీడియాలో ఒకట్రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో ఓ మహిళతో సరస సల్లాపాలకు సంబంధించిన మాటలున్నాయి. అయితే అవి ఫేక్ అని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అంబటి అన్న సంగతి తెలిసిందే.
అందులో అంబటి అన్నట్టు ప్రసారం, ప్రచారమైన గంట, అరగంట మాటల్ని …టీడీపీ ప్రజాప్రతినిధులు ఒక వ్యూహం ప్రకారం అసెంబ్లీలో ప్రస్తావించారు. తనను అవమానించేలా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అంబటి తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.
ఇదిగో గంటకాదు నువ్వొస్తే మొత్తం కావాలని తనదైన శైలిలో వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు బండారం గంట కావాలో, అరగంట కావాలో, మాధవరెడ్డి గారి సంగతేంటో ఇవన్నీ మాట్లాడుకునేందుకు ఇది సమయం కాదని అన్నారు.
తనకు గంట కావాలనే మాట ప్రతిపక్ష నేతలు వ్యంగ్యంగా మాట్లాడారని అంబటి అన్నారు. అలాంటి విషయాలు చర్చించుకుందామని అంటే, చంద్రబాబు అవే విషయాలు మాట్లాడుదాం అంటే తప్పని సరిగా ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుంటామని అంబటి తిప్పికొట్టారు. వీళ్లు ఉంటారా, బయటికి పోతారా? అనేది తేలాలని అంబటి సీరియస్‌గా అన్నారు.
గంట, అరగంట అనే విషయాలు మాట్లాడుకుంటే… చాలా విషయాలు మనం రచ్చ చేసుకున్నట్టువుతుందని అంబటి అన్నారు. అంబటి మాటలకు చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా సభలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ మాజీ మంత్రి, దివంగత నేత మాధవరెడ్డిని తెరపైకి తెచ్చి లోకేశ్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఏకంగా అవే విషయాలు పరోక్షంగా అసెంబ్లీలో చర్చకు దారి తీయడం విచారకరం. అంబటిని రెచ్చగొట్టకుండా వుంటే విచారకర ఘటనలు అసెంబ్లీలో చోటు చేసుకునేవి కావనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ వేసిన ఎత్తుగడ విఫలమై అధినేతే బయటికి నడవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.