మండలి రద్దుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడులో ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరినట్టుగా ఉంది. చంద్రబాబు చుట్టూ నలుగురు నేతలు ఇప్పుడు కనిపిస్తున్నారంటే దానికి మండలి ఒక కారణం. అక్కడ దాదాపు ముప్పై మంది వరకూ తెలుగుదేశం పార్టీ తరఫున హడావుడి చేశారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మండలి రద్దు తీర్మానం అసెంబ్లీ వరకూ వెళ్లి ఆమోదం పొందింది. దీంతో సహజంగానే తెలుగుదేశం అధినేతలో అసహనం పతాక స్థాయికి చేరినట్టుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్రమైన అసహనంతో అత్యంత అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు. జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కొట్టారంటూ.. తనకు తోచినట్టుగా మాట్లాడారు ప్రతిపక్ష నేత. ఆ విషయాన్ని విజయమ్మ రోశయ్యకు చెప్పారంటూ.. చంద్రబాబు నాయుడు తనకు తోచిన అబద్ధాన్ని అల్లేశారు. మరీ ఇంత దుర్మార్గంగా, తోచిన అబద్ధాన్ని చెప్పడం.. చంద్రబాబులో అసహనం ఏ స్థాయిలో పేరుకుపోయిందో స్పష్టం చేస్తూ ఉంది.
ఎన్నికలకు ముందేమో.. వైఎస్ వివేకను జగన్ కొట్టారంటూ ప్రచారం చేశారు,ఇప్పుడేమో వైఎస్ నే జగన్ కొట్టారంటూ.. తెలుగుదేశం పార్టీ తనదైన మాటలు మాట్లాడుతూ ఉంది. ఈ సారి స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారు.
తన కొడుకుకు ఉద్యోగం పోయిందని చంద్రబాబు నాయుడు ఇంతలా అసహనభరితుడు అయిపోయినట్టుగా ఉన్నారు. ప్రజల నుంచి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా చంద్రబాబు నాయుడు తనయుడు పెద్దమనిషిగా చలామణి అవుతూ ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన అవమానాన్ని ఎలా దిగమింగారో కానీ.. ఎమ్మెల్సీ పదవి పోతుండటాన్ని మాత్రం సహించలేకపోతున్నట్టుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరీ బరితెగింపు అబద్ధాలను అల్లేసి తన అక్కసు తీర్చుకుంటున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.