చంద్రబాబు ఇప్పుడు ఆ మాటే ఎత్తరేం!

అసలు కర్ణాకటలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడటమే తన ఐడియా అని చెప్పుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. కాంగ్రెస్, జేడీఎస్ లు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం వ్యతిరేకంగా పోటీ…

అసలు కర్ణాకటలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడటమే తన ఐడియా అని చెప్పుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. కాంగ్రెస్, జేడీఎస్ లు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం వ్యతిరేకంగా పోటీ చేసుకున్నాయి. ఒక పార్టీని మరోపార్టీ తీవ్రంగా విమర్శించుకున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ పోరు సాగింది. అలాంటి పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రజలను వెక్కిరించడం!

అలాంటి ఐడియాను తనే ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్పుకున్నారు. ఇక కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అక్కడే కాంగ్రెస్ వాళ్లతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్లతో చేతులు కలిపిన ఘట్టం కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవమే!

ఇక కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తీరును చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా విమర్శించారో అందరికీ తెలిసిందే. అదంతా చంద్రబాబుకు సంబంధం లేని వ్యవహారం. అయితే తనను తాను ఒక జాతీయ నాయకుడిగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు అప్పుడు అంత కంగాళీ చేశారు. తీరా ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వం పడిపోయింది. చంద్రబాబు నాయుడు తన ఐడియాతో ఏర్పాటు చేయించిన ప్రభుత్వం కుప్పకూలింది. ఈ వైనంపై కాంగ్రెస్ వాళ్లు స్పందిస్తున్నారు, జేడీఎస్ వాళ్లు స్పందిస్తున్నారు, ఇంకా ఇతర పార్టీల వాళ్లూ రియాక్ట్ అవుతున్నారు.

అయితే తన ఐడియా మేరకే అక్కడ ప్రభుత్వం ఏర్పడిందన్న చంద్రబాబు మాత్రం మారు మాట్లాడటం లేదు! బీజేపీని అస్సలు విమర్శించడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ బీజేపీ ఎక్కడైనా ఇలా చేస్తే ముందుగా చంద్రబాబే రియాక్ట్ అయిపోయే వారు. ఇప్పుడు మాత్రం అంత జరుగుతున్నా, తన ఐడియాతో ఏర్పాటు అయిన ప్రభుత్వం పడిపోయినా చంద్రబాబు కిమ్మనడం లేదు! ఎంత తేడా వచ్చింది చంద్రబాబుగారూ!

డియర్ కామ్రేడ్ నా మూడేళ్ళ కష్టం.. భరత్ స్పెషల్ చిట్ చాట్

‘అర్జున్ రెడ్డి’ లెగసీ ఇంకా.. ఇంకా..!