రాధా చేజారకుండా చంద్రబాబు పాట్లు!

వంగవీటి రంగా వర్ధంతి సభ జరిగితే.. ఆ కార్యక్రమానికి వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరికీ దమ్ములుండవు. కానీ.. వారికి వంగవీటి రాధా దన్ను మాత్రం తప్పక కావాల్సిందే. రాధా చేజారిపోతే.. పార్టీకి ఎంత…

వంగవీటి రంగా వర్ధంతి సభ జరిగితే.. ఆ కార్యక్రమానికి వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరికీ దమ్ములుండవు. కానీ.. వారికి వంగవీటి రాధా దన్ను మాత్రం తప్పక కావాల్సిందే. రాధా చేజారిపోతే.. పార్టీకి ఎంత పెద్ద నష్టమో చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. 

అందుకే.. అసలు జరిగిందో లేదో తెలియని రెక్కీ వ్యవహారానికి సంబంధించి.. రాధా ఏదో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినంత మాత్రాన చంద్రబాబునాయుడు చాలాచాలా అతి చేస్తున్నారు. తాజాగా.. రాధా ఇంటికి వెళ్లి.. పరామర్శలు, ధైర్యం చెప్పే పేరుతో రాధా పార్టీలోంచి జారిపోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

వంగవీటి రాధా.. తెలుగుదేశం పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారు. తెలుగుదేశం దన్ను వంగవీటి కుటుంబానికి అవసరమా? తెలుగుదేశం పార్టీ లేకపోతే.. రాధా రాజకీయాల్లో మనుగడ సాగించలేరా? లాంటి ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. కానీ, సూటిగా చెప్పాలంటే.. రంగా కొడుకు రాధాకు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం కంటె.. తెలుగుదేశానికి రంగా అవసరమే చాలా చాలా ఎక్కువ. ఆయనకు తగిన గౌరవం పార్టీ ఎన్నడూ ఇవ్వలేదు గానీ.. పార్టీ నుంచి వెళ్లిపోకుండా మాత్రం కాపు కాసుకుంటూ ఉంటుంది. 

రంగా వర్ధంతి సభలో తనను హత్య చేయడానికి రెక్కీ జరిగిందంటూ.. రాధా ఒక మాట అన్నారు. అక్కడికేదో చంద్రబాబునాయుడు హత్యే జరిగిపోయినంతగా హడావుడి చేస్తున్నారు. ఇంతా కలిపి రాధా తన హత్యకు రెక్కీ జరిగినట్లుగా సభలో జనాకర్షణ కోసమా అన్నట్టుగా చెప్పారే తప్ప.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. అయినా సరే.. ప్రభుత్వమే భద్రత ఏర్పాటు చేయబోతే.. తాను ప్రజల మనిషిని అని భద్రతవద్దని తిరస్కరించారు. అయితే.. ఇంకో వైపు నుంచి హత్యకు ప్రయత్నించిన దోషులను పట్టుకోవాలంటూ.. డీజీపీకి లేఖ రాసి.. చంద్రబాబునాయుడు మరో కామెడీ ఎపిసోడ్ కు తెరతీశారు. డీజీపీ ఇంకా ఎవరినీ అరెస్టులు చేయలేదంటూ.. తనకామెడీని కొనసాగిస్తున్నారు.

చంద్రబాబు శనివారం రాధా ఇంటికి వెళ్లారు. ఆయనతోను, ఆయన తల్లి రత్నకుమారితోను మాట్లాడారు. రెక్కీ విషయంలో ప్రభుత్వం స్పందించలేదని.. మరోసారి గుడ్డకాల్చి పైన వేయడానికి ప్రయత్నించారు. పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. వంగవీటి కుటుంబానికి అండగా ఉంటానని తెలుగుదేశం చంద్రబాబునాయుడు అనడం ఎంత కామెడీనో విజయవాడ ప్రజలు ఊహించుకోగలరు. 

‘తాను లేఖ రాసినా డీజీపీ పట్టించుకోలే’దని అంటున్న చంద్రబాబు.. అక్కడికేదో తన లేఖ శిలాశాసనం అని ఇంకా భ్రమల్లో ఉన్నట్టుగా ఉంది. కేవలం మాటను ఆధారం చేసుకుని దర్యాప్తు చేయమనడం చిత్రం.

రాధాపై ఇంత ఎగస్ట్రా ప్రేమ ఎందుకంటే.. పార్టీకి ఇప్పుడున్న కష్టకాలంలో.. వంగవీటి రాధా దూరమైతే గనుక.. (కారణాలు ఏమైనా కావొచ్చు గాక..) ఆయన వైసీపీలోకి వెళ్లకపోయినా.. నిర్లిప్తంగా ఉండిపోయినా సరే.. తెలుగుదేశానికి కాపు వర్గం దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కులాలు ఓన్ చేసుకునే నాయకులు కొందరు ఉంటారు. వారి విషయంలో జరిగే పరిణామాలపట్ల కులం మొత్తం స్పందించే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. 

కాపు కులానికి సంబంధించి.. వంగవీటి రంగా కుటుంబానికి అలాంటి ఆదరణ ఉంది. అందుకే చంద్రబాబు ఇంత అతి ప్రేమ చూపిస్తూ.. రాధాను దువ్వుతున్నారని పలువురు అంచనా వేస్తున్నారు.