కాలంతో పాటు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఏవైతే విలువలని భావించే వాళ్లో, అవే లక్షణాలు ఇప్పుడు అసమర్థత కింద పరిగణిస్తున్నారు.
ఇప్పుడంతా బూతుల కాలం నడుస్తోంది. నువ్వొక తిట్టు తిడితే, అంతకు పదింతలు రివర్స్ అటాక్ చేసే వాళ్లకే నేటి రాజకీయాల్లో క్రేజ్. ఈ పరిణామాల మంచీచెడుల సంగతి పక్కన పెడితే… వాస్తవం ఇదే. దీన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు.
ఈ నేపథ్యంలో నేటి రాజకీయ పంథాకు అనుగుణంగా చంద్రబాబు కూడా గేర్ మార్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. టీడీపీ తరపున టికెట్ కావాలంటే… షరతులు వర్తిస్తాయని ఆయన నిర్మొహమాటంగా చెబుతున్నారు. చిత్తూరు పర్యటనలో భాగంగా చంద్రబాబును కలిసిన పలువురు నాయకులకు ఆయన ఇదే తేల్చి చెప్పారు.
ఇకపై రాజకీయ ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించేవారికే పార్టీ టికెట్, ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రత్యర్థులకు తగ్గట్టు దీటుగా సమాధానం ఇస్తూ, దూకుడుగా వ్యవహరించే నాయకులకే పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్టు తన అంతరంగాన్ని నాయకుల ఎదుట ఆయన బయట పెట్టారు.
అలాగైతేనే మనుగడ సాగించగలమని ఆయన చెప్పడం గమనార్హం. అందుకే ఆయన తన పార్టీలో బూతుల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.