ఎన్టీఆర్ తనయ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఏ రోజూ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. అమరావతి రాజధాని ఆందోళనకు మద్దతుగా బంగారు గాజులు విరాళంగా ఇవ్వడం మినహాయించి ఆమె ఏ రోజూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కుటుంబ, వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. అరుదుగా కనిపించే ఆమెను చూడగానే గౌరవంతో నమస్కారం చేయాలనిపిస్తుంది.
చంద్రబాబునాయుడిని చేసుకున్న నేరమో, పాపమో తెలియదు కానీ, అనవసరంగా నీచ రాజకీయ చర్చకు ఆమె బలి అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య విషయంలో టీడీపీ ఆరోపిస్తున్నట్టు వైసీపీ నేతల జుగుప్సాకర కామెంట్స్ గురించి కాసేపు పక్కన పెడితే, వాటిని పట్టుకుని చంద్రబాబు వేలాడడం చూస్తే కంపరం పుడుతోంది. తాజాగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బాధితుల ఓదార్పు కంటే… తన గోడు వారికి చెప్పడానికే ఎక్కువ సమయాన్ని ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తాను దుఃఖాన్ని దిగమింగుకుని వచ్చానంటూ కడప, చిత్తూరు జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో ఆయన చెప్పడం గమనార్హం. వరదలకు జనం నష్టపోయిన వారి దుఃఖం కంటే… చంద్రబాబుది ఏ రకంగా ఎక్కువో ఆయనే చెప్పాల్సి వుంది. తన అనుభవమంత వయసు కూడా లేని జగన్ అసెంబ్లీలో తనను అవహేళన చేసి మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్య భువనేశ్వరిని కూడా అసెంబ్లీలో సీఎంతో పాటు వారి మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆయన వాపోయారు.
భువనేశ్వరికి భర్తగా, కుటుంబానికి పెద్దగా అసెంబ్లీలో జరిగిన అవమానానికి కుంగి పోవాల్సి వచ్చిందన్నారు. నిండుసభలో భార్యను దూషించడంతో అవమానంగా భావించి దుఃఖానికి లోనయ్యానన్నారు. దుఖాన్ని దిగమింగుకుని బాధితులను పరామర్శించడానికి వచ్చినట్టు చంద్రబాబు తెలిపారు.
దివంగత ఎన్టీఆర్, తానూ 22 ఏళ్లు ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి సేవలు అందించామన్నారు. ఏనాడూ తన భార్య రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. అలాంటి ఆమెను కూడా సభలో అసభ్యంగా మాట్లాడడం చాలా బాధ కలిగించిందని చంద్రబాబు చెప్పుకోడాన్ని చూస్తే…చంద్రబాబు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. రాజకీయ చరమాంక దశలో ఆఖరి అస్త్రంగా భార్యను కూడా బలి పెడుతున్నారనేందుకు తాజాగా వరద బాధితుల పరామర్శ పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలే నిర్శనమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు తన భార్య గురించి ప్రస్తావిస్తూ సానుభూతి పొందాలనే ప్రయత్నాలను జనం పసిగట్టారు. అందు వల్లే ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోని భువనేశ్వరిని భర్తే అవమానించే రీతిలో చర్చకు పెట్టడాన్ని ప్రజానీకం జీర్ణించు కోలేకుంది. ఎందుకంటే గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు స్వార్థ, అవకాశవాద రాజకీయాల గురించి తెలిసిన జనానికి, బాబు మొసలి కన్నీళ్ల వెనుక కారణాలేంటో బాగా తెలిసొచ్చింది. సానుభూతి వరద వరద పారించాలనే చంద్రబాబు వ్యూహం ఫలించలేదు.