ఔను…ఈ వయసులో ఏంద‌య్యా!

తిరుప‌తి న‌గ‌రంలోని వ‌ర‌ద ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. చంద్ర‌బాబు క‌ష్టాన్ని చూసి ఎస్వీయూ రిటైర్డ్ ఎంప్లాయ్ చ‌లించిపోయాడు. ఈ వ‌య‌సులో మీకెందుక‌య్యా ఇంత క‌ష్ట‌మంటూ…

తిరుప‌తి న‌గ‌రంలోని వ‌ర‌ద ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కృష్ణ‌న‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. చంద్ర‌బాబు క‌ష్టాన్ని చూసి ఎస్వీయూ రిటైర్డ్ ఎంప్లాయ్ చ‌లించిపోయాడు. ఈ వ‌య‌సులో మీకెందుక‌య్యా ఇంత క‌ష్ట‌మంటూ ఉద్వేగంగా మాట్లాడ్డం అక్కుడున్న వారిని ఆలోచింప‌చేసింది.  

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ‌య‌సు 72 ఏళ్లు. నిజానికి ఇదే ప్ర‌భుత్వ ఉద్యోగి అయి వుంటే పుష్క‌ర కాలం క్రిత‌మే విశ్రాంతి తీసుకునే వారు. రాజ‌కీయ నేత‌ల‌కు అలాంటి నిబంధ‌న‌లేవీ లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు మ‌ళ్లీ తానే సీఎం అవుతాన‌ని చెబుతున్నారు. కానీ వ‌య‌సు, అందుకు త‌గ్గ‌ట్టు అనారోగ్య స‌మ‌స్య‌లు బాధ పెడ‌తాయి.

చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేశ్ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడై వుంటే… ఇవాళ మాజీ ముఖ్య‌మంత్రికి ఈ దుస్థితి వ‌చ్చి వుండేది కాద‌నేది టీడీపీ శ్రేణులు అభిప్రాయం కూడా. లోకేశ్ రాజ‌కీయాల్లో త‌న నాయ‌క‌త్వాన్ని నిరూపించుకోలేక పోతుండ‌డంతో వ‌య‌సు పైబ‌డుతున్నా… చంద్ర‌బాబే క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించాల్సి వ‌స్తోంద‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. లోకేశ్ మాట్లాడితేనే స‌మ‌స్య అనే భ‌యాందోళ‌న‌లో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లున్నారు.

అందువ‌ల్లే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చంద్ర‌బాబే వెళ్లాల్సి వ‌స్తోంద‌ని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. తాజాగా వ‌ర‌ద ప్రాంతాల్లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, వారికి జీవితాల‌పై భ‌రోసా క‌ల్పించే బాధ్య‌త‌ను లోకేశ్ తీసుకుని వుంటే బాగుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఎందుక‌నే లోకేశ్‌ను పంప‌డానికి చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని అంటున్నారు. ఆ క‌ష్ట‌మేదో తానే ప‌డ‌తాన‌ని, లోకేశ్‌ను మాత్రం ఇప్ప‌ట్లో క్షేత్ర‌స్థాయిలో క్రియాశీల‌కంగా తిప్ప‌న‌ని చంద్ర‌బాబు అంటున్న‌ట్టు స‌మాచారం. మ‌రి లోకేశ్ లాంటి వార‌సుడున్న త‌ర్వాత‌… చంద్ర‌బాబుకు క‌ష్టాలు కాక మ‌రేం వ‌స్తాయ‌ని నెటిజ‌న్ల ట్రోలింగ్ ఆలోచింప‌జేస్తోంది.