అసెంబ్లీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నోరు జారారు. గతంలో బయట చాలా సార్లు అవతలి వాళ్లను కించపరిచేలా, నోటి దురుసును ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసెంబ్లీలోనే ఆ పని చేశారు. బయట మాట్లాడటం ఒక ఎత్తు, అసెంబ్లీలో అందునా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడటం మరో ఎత్తు. అది కూడా స్పీకర్ ను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువుల గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… స్పీకర్ మీద పరుష పదజాలను ఉపయోగించారు. స్పీకర్ ను పట్టుకుని 'మర్యాద ఉండదు..' అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
బెదిరింపు ధోరణితోనే కాకుండా, తీవ్రమైన పదజాలాన్ని సైతం ఉపయోగించారు చంద్రబాబు నాయుడు. దీంతో ఈ విషయంపై అధికార పార్టీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై తెలుగుదేశం పార్టీకి అంత బాధ ఎందుకని.. అంటూ, స్పీకర్ పదవినే అవమానించేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ కావడంతో చంద్రబాబు నాయుడు భరించలేకపోతూ ఉన్నారని, అందుకే అనుచితమైన మాటలను ఉపయోగిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
మొత్తానికి చంద్రబాబు నాయుడు బయట మాట్లాడినట్టుగా, తన పార్టీ వాళ్లను చుట్టూ పెట్టుకుని చేసే వ్యాఖ్యల్లా అసెంబ్లీలో కూడా అలవాటైన రీతిలో నోరు జారారు. తనది నలభై యేళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ఇది సమంజసమేనా?