తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో తనకు కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిన ఎన్నికల్లో జనసేన తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే రాపాక.
అంతకు ముందు ఒక దఫా కాంగ్రెస్ తరఫున కూడా నెగ్గిన నేపథ్యం ఉన్న ఈయన గురించి పవన్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటా యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే, తమకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఒక్కటే అని పవన్ చెప్పుకు తిరుగుతున్నారు.
అయితే ఆ ఒక్కగానొక్క ఎమ్మెల్యే.. తనకు పవన్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు. దాన్ని తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాల్సిందే అని రాపాక అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ ఆ విషయంల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టడం వల్ల చాలా మంది దళితుల పిల్లలు ఆంగ్లమాధ్యంలో చదవగలరని రాపాక అంటున్నారు.
ఇలా పవన్ అజెండాకు భిన్నంగా స్పందిస్తున్నారు జనసేన ఎమ్మెల్యే. అలాగే పవన్ రేపో ఎల్లుండో చేపట్టే ఒక ధర్నా కార్యక్రమానికి కూడా తను హాజరు కావడం లేదని, తనకు అసెంబ్లీ ఉందని జనసేన ఎమ్మెల్యే చెప్పారు. సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా జనసేన ఎమ్మెల్యే తప్పు పట్టారు.