రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిసీముగియనట్టుగానే కాంగ్రెస్ నేతలకు కొంత ఊరట లభిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే డీకే శివకుమారకు బెయిల్ లభించింది. ఆయన బయటకు వచ్చి తను భారతీయ జనతా పార్టీ నేతలకు కూడా బోలెడన్ని బహుమతులు ఇచ్చిన వైనాన్ని వివరిస్తున్నారు. తన నుంచి కేంద్రమంత్రులు కూడా నజరానాలు తీసుకున్నారని ఆయన అంటున్నారు!
ఇలా బీజేపీ నేతల గుండెళ్లో ఆయన రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఆయనను మరీ ఎక్కువగా కదిలిస్తే.. కమలం పార్టీ వాళ్లకే ఇబ్బందిలాగుంది. ఆ సంగతలా ఉంటే.. తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి స్వల్ప ఊరట దక్కింది. అస్వస్థతతో బాధపడుతున్న ఆయనను ఎయిమ్స్ కు తరలించారు ఈడీ అధికారులు. చిదంబరానికి కడుపునొప్పి అని వార్తలు వస్తున్నాయి.
అందుకే చికిత్సకు ఎయిమ్స్ కు తరలించారట. ప్రస్తుతానికి రెండురోజుల పాటు అని తెలుస్తోంది. అయితే చిదంబరానికి కూడా ఇక బెయిల్ దక్కవచ్చనే ప్రచారం సాగుతూ ఉంది. ఎన్నికలు అయిపోయాయని.. ఇక మళ్లీ ఏవైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవరకూ కాంగ్రెస్ నేతలకు బీజేపీ నుంచి పెద్దగా ఇబ్బందులు ఉండవని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తూ ఉండటం గమనార్హం!