ఇదేంటి చిరంజీవికి కరోనా వస్తే.. ఆయనను అంతకు ముందు రోజే కలసిన కేసీఆర్, నాగార్జున, ఇతర నాయకులు భయపడాలి కానీ.. అసలు చంద్రబాబుకి ఏంటి భయం అనుకుంటున్నారా..? పోనీ చంద్రబాబు, చిరంజీవి మధ్య.. ఇటీవల రహస్య బేటీ ఏమైనా జరిగి ఉంటుందని ఆలోచిస్తున్నారా..? అసలు సంగతి వేరే ఉంది.
కొవిడ్ భయాలు తొలగిపోతున్న వేళ.. ఇప్పుడిప్పుడే సెలబ్రిటీలంతా ధైర్యంగా మాస్కుల్లేకుండా జనాల్లోకి వస్తున్నారు. నాయకులు కూడా గతంలో ఉన్న భయాలు పక్కనపెట్టి జనంతో కలివిడిగా ఉండేందుకు అలవాటు పడుతున్నారు. అలాగే చంద్రబాబు కూడా జూమ్ లో నుంచి బైటకు వద్దామని అనుకున్నారు.
నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన చంద్రబాబు.. ఈరోజు నుంచి 4 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని అనుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గానికి జూమ్ లో కాకుండా నేరుగా దిశా నిర్దేశం చేయాలి అనుకున్నారు. అందుకే షెడ్యూల్ ఖరారు చేసుకుని మరీ హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరి వచ్చారు.
అయితే చిరంజీవికి కరోనా సోకిన నేపథ్యంలో చంద్రబాబు షెడ్యూల్ అంతా తారుమారైంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న చిరంజీవి.. ఇటీవల రెండు కార్యక్రమాల కోసం బైటకు వచ్చారు. ఎక్కడ ఎవరు అంటించారో తెలియదు కానీ మెగాస్టార్ కి కరోనా సోకింది. అలాంటిది చంద్రబాబు ఇప్పుడు 25 పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గాల అధ్యక్షులతో, ఇతర నేతలతో సమావేశం అయితే ఇంకేమైనా ఉందా..?
జరగరానిదేమైనా జరిగితే ఆ వయసులో బాబు తట్టుకోవడం కష్టం. అందులోనూ ఇన్నాళ్లూ హైదరాబాద్ లో ప్రవాస జీవితం గడుపుతూ జాగ్రత్తలు పాటించిన ఆయన.. ఒక్కసారిగా జనాల్లోకి వచ్చి కష్టాలు కొనితెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అందుకే అపాయింట్ మెంట్లు అన్నీ క్యాన్సిల్ చేశారట.
సోమవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు శుక్రవారం వరకు అక్కడే ఉంటారని, అయితే ఎలాంటి అపాయింట్ మెంట్లు లేవని పార్టీ వర్గాలంటున్నాయి. ముందుగా ఖరారైన మీటింగ్ లన్నీ క్యాన్సిల్ అయినట్టు పార్టీ వర్గాల అంతర్గత సమాచారం. కేవలం చిరంజీవి ఎపిసోడ్ తోనే చంద్రబాబు షెడ్యూల్ అంతా తారుమారయినట్టు చెబుతున్నారు.