ఊరూవాడా బాగుండాలని, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పేరుతో పక్కా భవనాలు నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఊరికీ అవి స్థిరాస్తులన్నమాట.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం పండగలా సాగుతోంది. 25 నగర పంచాయతీలు, 71 మున్సిపాల్టీలు.. వీటికి అదనం. సచివాలయాలు, వాటి సమీపంలోనే రైతు భరోసా కేంద్రాలు ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయనే విషయం ఈపాటికే గ్రామస్తులకు అర్థమైంది.
అయితే వాటి వల్ల వచ్చే ఎన్నికల్లో తమకు చాలా విపత్తులు వస్తాయనే విషయం ప్రతిపక్షాలకు కూడా క్లారిటీ వచ్చేసింది. అంతే.. ఎక్కడికక్కడ స్థానికంగా జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. దీనికి తాజా ఉదాహరణే చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం వివాదం.
ఆల్రడీ ఇక్కడ సచివాలయాన్ని నిర్మించాలనుకుంటే.. స్థలం విషయంపై హైకోర్టులో ఇద్దరు వ్యక్తులు పిటిషన్ వేశారు. బండిదారిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారని అడ్డుకోవాలంటూ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ తర్వాత అధికారులు సమీపంలోనే రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించాలనుకున్నారు.
అయితే ఈ భవనం కూడా అదే సర్వే నెంబర్లో ఉండటంతో.. మరోసారి హైకోర్టులో మోకాలడ్డారు పిటిషనర్లు. ఈసారి కోర్టు మరింత తీవ్రంగా స్పందించింది. స్టేటస్ కో ఉత్తర్వులిస్తే.. మరో పేరుతో బిల్డింగ్ కడతారా అంటూ ప్రభుత్వాన్ని, అధికారుల్ని సూటిగా ప్రశ్నించింది.
చట్టపరంగా కోర్టు చేయాల్సిన పని కోర్టు చేసింది. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు పరిశీలిస్తే.. బండిదారి స్థలం గతంలో ఉపయోగంలో ఉండేది కానీ ప్రస్తుతం దాని అవసరం గ్రామస్తులకు లేదు. అందుకే అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విషయం మాత్రం టీడీపీ అనుకూల మీడియా రాయదు.
ప్రైవేటు వ్యక్తులకు లీజుకివ్వలేదు, ప్రైవేటు వ్యక్తులు అక్కడ భవనాలు కట్టట్లేదు, అందులో ప్రైవేట్ సంస్థల్ని నడపడం లేదు. సచివాలయం, రైతు భరోసా కేంద్రం అనేవి పూర్తిగా ప్రభుత్వ బిల్డింగ్ లు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు. మరి వీటిపై రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసం?
టీడీపీ నేతలు ఇలా గ్రామాల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు జగన్ ఆస్తులు కావు కదా? ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆకాంక్షలు. అలాంటి వాటి విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ తమ పంతం నెగ్గించుకోవాలని టీడీపీ చూడటం, పైగా వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటాన్ని ఏమనాలి?