తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఉత్కంఠ రేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మినహాయించి మిగిలిన అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యత కనబరుస్తున్నారు.దీంతో ప్రతి రౌండ్ టీఆర్ఎస్‌లో టెన్షన్ పుట్టిస్తోంది.
ప్రస్తుతం నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1,684 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ నామమాత్రం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో ఆధిక్యత కనబరచగానే టీఆర్ ఎస్ మరోసారి తన హవా కొనసాగించనున్నట్టు సంబరపడి పోయింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత ప్రజానాడి ఏంటో టీఆర్ ఎస్‌కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రౌండ్‌లో బీజేపీ 341, రెండవ రౌండ్‌లో 279, మూడో రౌండ్‌లో 750, నాలుగో రౌండ్‌లో 415 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మొదటి రౌండ్ ఫలితం వచ్చినప్పుడు దుబ్బాక అర్బన్‌లో బీజేపీకి పట్టు ఉందని , అక్కడ మెజార్టీ వస్తుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నామని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. ఆ తర్వాత రూరల్‌కు వచ్చినా అవే ఫలితాలు పునరావృతం కావడంతో ఐదో రౌండ్ వరకూ ఇట్లే వుంటుందని మళ్లీ టీఆర్ఎస్ నేతలు మాట మార్చారు.
ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ రేపుతోంది. మధ్యాహ్నానికి ఫలితం రానుంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాత్రం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదికయ్యే అవకాశం ఉంది. అందుకే అందరి దృష్టి దుబ్బాకపై నిలిచింది.