పవన్ కల్యాణ్-వైసీపీ నాయకుల మాటల యుద్ధానికి కాస్త బ్రేక్ పడింది. దాదాపు వారం రోజులుగా సాగిన వాగ్బాణాలన్నీ ఇప్పుడు అమ్ముల పొదిలో రెస్ట్ తీసుకుంటున్నాయి. జగన్ ని టార్గెట్ చేసుకుంటూ పవన్ కల్యాణ్ మాట్లాడటం, వాటికి వైసీపీ నాయకులు గట్టిగా రియాక్ట్ కావడం, పూర్తిగా పర్సనల్ వ్యవహారాల్లోకి మాటలు వెళ్లిపోవడం అంతా చూస్తుండగానే జరిగిపోయింది.
కన్నబాబు, అంబటి.. పవన్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చి హీరో అయిన పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి విలన్ గా మారారని ఘాటుగానే తగిలించారు. దీన్ని వదిలేస్తే.. ఇంకా వ్యక్తిగత వ్యవహారాల వరకు వెళ్లే ప్రమాదముందని గ్రహించి చిరంజీవి రంగంలోకి దిగారు. కన్నబాబుకి సర్దిచెప్పారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పరిగణించవద్దని, తమ్ముడి దుడుకుతనం నీకు తెలుసు కదా అని అనునయించారు.
అటు అంబటి కూడా ఈ రాయబారం తర్వాత సైలెంట్ అయ్యారు. మొత్తమ్మీద మూడు రోజులుగా రెండు శిబిరాల నుంచి ఎలాంటి మాటల తూటాలు బైటకు రాలేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ కి కూడా కాస్త గట్టిగానే చిరంజీవి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు ట్రాప్ లో పడిపోవద్దని, బాబు రెచ్చగొడితే జగన్ పై విమర్శలు చేయొద్దని సూచించారట.
పవన్ మాటలకు జనసేన నాయకులు ఎగిరి గంతులేస్తున్నా.. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, జరుగుతున్న ట్రోలింగ్ ని ఓ కంట కనిపెట్టాలని కూడా సుద్దులు చెప్పారట చిరు. ఓవరాల్ గా జగన్ పై ఘాటుగా విమర్శలు చేసి, ఉన్న ఇమేజ్ ని డ్యామేజీ చేసుకోవద్దని పవన్ ను కోరారట చిరంజీవి.
అందుకే 3 రోజులుగా పీక్ లో సాగిన పవన్ వర్సెస్ వైసీపీ యుద్ధం కాస్త శాంతించింది. చిరంజీవి సూచించిన శాంతి మంత్రాన్నే ఇరువర్గాలు పఠిస్తున్నాయి. అయితే పవన్ అంత నిలకడగా ఉండే మనిషికాదని అందరికీ తెలుసు, ఎవరు ఎటు గిల్లినా వెంటనే రెచ్చిపోయి మాట్లాడతారు. జనసేనాని ఎన్నాళ్లిలా శాంతంగా ఉంటారో చూడాలి. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఎన్నికల తర్వాత తొలిసారి పవన్ కు, వైసీపీ విమర్శల వాడి ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఇకపై పవన్ కాస్త తన నోటిని అదుపులో పెట్టుకుంటారని ఆశిద్దాం.