ఉగాదికి ఇళ్ల పట్టాలు.. జగన్ కు తప్పవా కష్టాలు?

ఇప్పటి వరకూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలనూ పట్టాలెక్కించారు, కొన్ని అమలులోకి వచ్చేశాయి, మరికొన్ని మధ్యలో ఉన్నాయి, ఇంకొన్ని పథకాలకు ముహూర్తాలు అనౌన్స్ చేసి మరీ తన కాన్ఫిడెన్స్…

ఇప్పటి వరకూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలనూ పట్టాలెక్కించారు, కొన్ని అమలులోకి వచ్చేశాయి, మరికొన్ని మధ్యలో ఉన్నాయి, ఇంకొన్ని పథకాలకు ముహూర్తాలు అనౌన్స్ చేసి మరీ తన కాన్ఫిడెన్స్ లెవల్స్ ని చూపించారు జగన్. అయితే ముందుంది ముసళ్ల పండగ అన్నట్టు ఉగాది నాటికి పాతిక లక్షలమందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామన్న హామీ తరుముకొస్తోంది.

సాధారణంగా చూస్తే ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. తూతూమంత్రంగా పట్టాలు చేతులో పెట్టి, ఇళ్ల స్థలాలు మీరే వెతుక్కోండి అని టీడీపీ హయాంలోలాగా చేసి చేతులు దులుపుకోవచ్చు. కానీ ప్రతి పనినీ పగడ్బందీగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఇళ్లస్థలాల పంపిణీని ప్రహసనంగా మార్చేందుకు ససేమిరా అంటున్నారు.

“పాతిక లక్షల మందిలో ఏ ఒక్కరికి కూడా వివాదం ఉన్న స్థలం ఇవ్వడానికి వీళ్లేదు. ప్రభుత్వ భూమి లేనిచోట్ల, ప్రైవేట్ భూమిని కొని దాన్ని నివాసయోగ్యంగా మార్చి లబ్ధిదారులకు కేటాయించాల”ని ఆదేశాలిచ్చారు. ఇక్కడే అధికారులు దిక్కులు చూస్తున్నారు. ప్రైవేట్ స్థలాల సేకరణకు ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం ఏ మూలకీ సరిపోదు, ప్రభుత్వం కొనడానికి ఆసక్తిగా ఉంది అని తెలియగానే పల్లెటూళ్లలో కూడా చాలామంది రేట్లు పెంచేసి కూర్చున్నారు. దీంతో స్థలాల సేకరణ సమస్యగా మారింది.

మరోవైపు రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపు, అగ్రిగోల్డ్ బాధితుల గుర్తింపు అనేది కొనసాగుతూనే ఉంది. అటు మంత్రులు కూడా స్థలాల సేకరణపై పెద్దగా దృష్టిసారించినట్టు కనిపించడం లేదు. సీఎం మాత్రం ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రోగ్రెస్ పై అయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ప్రతి జిల్లాలో దాదాపు 2లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం కూడా అధికారులకు తలకుమించిన భారంగా మారుతోంది.

ఇప్పటికే అప్లై చేసినవాళ్లు, స్థలాలు, పొలాలు ఉన్నవాళ్లు, రాజకీయ పలుకుబడితో అర్జీలు ఇచ్చి సవాళ్లు విసురుతున్నారు. వీరందరికీ సర్ది చెబుతూ ఉగాదినాటికి 25లక్షల ఇళ్ల స్థలాలు, అది కూడా రిజిస్టర్ చేసి మరీ పంపిణీ చేయాలంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ ఒక్కటీ సవ్యంగా జరిగితే రిజిస్టర్ ఇళ్ల పట్టాలిచ్చిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో జగన్ చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.