డియర్ ఎడ్మిన్.. ఆత్మరక్షణ చేసుకోండి!

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు మరికొద్ది సేపట్లో వెలువడబోతోంది. సోషల్ మీడియా ఇప్పుడున్న విశృంఖల రూపానికి.. తీర్పు వెలువడిన వెంటనే.. ఎలాంటి తీర్పు వచ్చినా సరే.. దానికి అనుకూలంగా- ప్రతికూలంగా అనేకానేక మంది…

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు మరికొద్ది సేపట్లో వెలువడబోతోంది. సోషల్ మీడియా ఇప్పుడున్న విశృంఖల రూపానికి.. తీర్పు వెలువడిన వెంటనే.. ఎలాంటి తీర్పు వచ్చినా సరే.. దానికి అనుకూలంగా- ప్రతికూలంగా అనేకానేక మంది తమ తమ అభిప్రాయాలు వెల్లువెత్తించడం సహజం.

‘ఇది నా అభిప్రాయం కాదు’ అనే జాగ్రత్త తీసుకుంటూ.. ‘ఫార్వార్డెడ్ యాజ్ రిసీవ్డ్’ అనే ముసుగు తొడిగి ప్రచారంలో పెట్టేవారు కొందరు. ఏదేమైనా.. అన్నింటికంటె వాట్సప్ ద్వారా అత్యంత వేగంగా ప్రచారం జరుగుతుంది. అందుకే వాట్సప్ లో గ్రూపులు నిర్వహించే ఎడ్మిన్‌లు తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిగత అభిప్రాయాలు చెలామణీలోకి వచ్చేస్తాయి. వీటిలో అత్యధికం విషం చిమ్మేవిగానే ఉంటాయి. ఎవరు వ్యాఖ్యలు చేసినా.. మరొకరిని నొప్పించే విధంగానే చేసే అవకాశం చాలా ఎక్కువ.

అందుకే.. ప్రభుత్వం ఈరోజునుంచి కొన్నిరోజుల పాటు సోషల్ మీడియా మీద విపరీతంగా నిఘా పెట్టనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ నిఘా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం…లాంటి ప్రవచనాలన్నీ తర్వాత.. ముందు మనం పరిమితులు ఎరిగి, హద్దు దాటకుండా మన అభిప్రాయాలు వెలిబుచ్చడం ముఖ్యం.

ప్రత్యేకించి వాట్సప్ గ్రూపులు.. ఇలాటి విష ప్రచారాలకు వాహకాలుగా ఉంటాయి. వాట్సప్ గ్రూపు ఎడ్మిన్ లను బాధ్యులను చేసే చట్టం ఉంది. అందుకే గ్రూపు ఎడ్మిన్ లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ముందుగానే.. సభ్యులెవరూ అయోధ్య అంశం మీద తమ గ్రూపులో ఎలాంటిపోస్టులు పెట్టవద్దంటూ.. విజ్ఞప్తి చేస్తూ పోస్టులు పెడితే.. వారు కనీస ప్రయత్నం చేయడం అవుతుంది. ఎవరైనా అలాంటి విపరీత పోస్టులు పెట్టినా కూడా.. వెంటనే వాటిని తొలగించాల్సిందిగా గ్రూపులోనే కోరాలి.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. వారు ఎడ్మిన్‌లుగా ఉన్న గ్రూపుల ద్వారా దుష్ప్రచారం జరిగినప్పటికీ.. నేరంలో తమ పాత్ర లేదని వారు సంజాయిషీ చెప్పుకోవడం కుదురుతుంది.

వచ్చే తీర్పు ఎటూ వస్తుంది..

రేగే విద్వేషాలు ఎటూ రేగుతాయి…

సాగే దుష్ప్రచారాలు ఎటూ సాగుతాయి…

పనిగట్టుకుని విషం చిమ్మే వాళ్లు.. నిఘా కళ్లకు చిక్కకుండా చాలా జాగ్రత్తలే తీసుకుంటారు.

మధ్యలో తగుదునమ్మా అంటూ వాటిని ఫార్వార్డ్ చేస్తూ.. ప్రచారాలకు పాల్పడేవారు, ఉపయోగపడేవారు.. ఆ పోస్టులు చూసిన ఆవేశంలో తాము కూడా రెచ్చిపోయి కామెంట్లు పెట్టేవారిలో అమాయకులు మాత్రం చట్టానికి చిక్కిపోతారు.. తస్మాత్ జాగ్రత్త! ఎడ్మిన్ లూ మరింత జాగ్రత్త!