నిన్నటిదాకా జగన్మోహనరెడ్డి.. స్వయంగా వెళ్లి.. భవన నిర్మాణ కార్మికుల్ని హత్యలు చేస్తున్నట్లుగా తమకు చేతనైనన్ని వక్రభాష్యాలు చెప్పడానికి ప్రయత్నించారు. తక్షణం జగన్ ప్రభుత్వం కూలిపోతే తప్ప రాష్ట్రానికి మంచి జరగదు అన్నట్లుగా అభివర్ణించారు.
వర్షాలు, నదుల్లో నీటి ప్రవాహం దండిగా ఉండడం వల్ల రీచ్ లలో ఇసుక తవ్వకాలే సాధ్యం కావడం లేదంటే.. ఆ మాట ప్రజలకు వినపడకుండా.. నానా రచ్చా చేశారు. వారి గోలకు ఇప్పుడు ఫుల్స్టాప్ పడిపోతోంది. ఇసుక తవ్వకాలు ఇప్పుడు బాగా పెరిగాయి. అధికారిక గణాంకాలు అదే చెబుతున్నాయి. ఈ కొన్నిరోజులు ఓర్చుకోలేక నానా గగ్గోలు చేసిన ప్రతిపక్షాలు నోర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో ఒక రోజుకు 1.5 లక్షల టన్నుల ఇసుక తవ్వకాల అవసరం ఉంటుందనేది అంచనా. అయితే రీచ్‌లలో నీటి ప్రవాహం విపరీతంగా ఉన్న కారణంగా.. ఇటీవలి కాలం వరకు రోజుకు 15-20 వేల టన్నులు కూడా తీయలేకపోయారు. అనివార్యంగా కొరత ఏర్పడింది. ఈలోగా గోల ఎక్కువైంది. వర్షాకాలంలో పనులు సాగవనే వాస్తవం తెలిసిన కార్మికులంతా చల్లగానే ఉన్నారు. మధ్యలో విషయ పరిజ్ఞానం లేని నాయకులంతా జగన్‌ను తిట్టడం స్టార్ట్ చేశారు.
ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రీచ్‌లలో తవ్వకానికి కొద్దిగా వీలు చిక్కుతోంది. దీంతో ప్రస్తుతం రోజుకు 85వేల టన్నుల వరకు ఇసుక తవ్వుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది రోజువారీ అవసరంలో సగానికంటె ఎక్కువ. నిర్మాణ పనులన్నీ మళ్లీ ముమ్మరం అయ్యే అవకాశం ఉంది. ఇసుక కొరతకు కారణమేంటో తెలుసుకోకుండా.. తక్షణం ఇసుక దొరికే ఏర్పాటు చేయాలి.. అంటూ అందరూ యాగీ చేశారు. ఇప్పుడు ఇసుక దొరకుతోంది. ఇక జగన్ ను కీర్తిస్తారా? వారికి అంత వివేకం కలుగుతుందనుకోవడం కల్ల.
ఇంకొన్ని రోజులు ఆగిచూడండి.. రీచ్ లు ఉన్నచోట నీటిమట్టం ఇంకాస్త తగ్గితే… అవసరానికి మించి ఇసుక లభ్యత ఉంటుంది. ఇప్పుడే ఆన్లైన్ విక్రయాలకు అరగంట వరకు అవకాశం దొరుకుతోంది. పూర్తి లభ్యత వచ్చాక.. ఇసుకను బ్లాక్ మార్కెటింగుకు తరలించిన దళార్లందరి ఆట కట్టుతుంది. అప్పుడు కొత్త ఇసుక విధానం ద్వారా.. ఎలాంటి మార్పునైతే జగన్ సర్కారు లక్ష్యించిందో.. అది అచ్చంగా కార్యరూపంలో కనిపిస్తుంది. కువిమర్శలు చేసేవాళ్లంతా తమ మొహాలు కూడా దాచుకోవాల్సి వస్తుంది.