ఎన్నికల్లో తెదేపాకు బాగానే మిగిలింది!

రాజకీయ పార్టీలు పుట్టేది అన్ని సందర్భాల్లోనూ అధికారం కోసం మాత్రమే అనుకుంటే పొరబాటు. సంపాదనకోసం కూడా పుడుతుంటాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు పట్టుమని పది కూడా ఉండవు. కానీ.. బరిలోకి దిగే రాజకీయ పార్టీలు…

రాజకీయ పార్టీలు పుట్టేది అన్ని సందర్భాల్లోనూ అధికారం కోసం మాత్రమే అనుకుంటే పొరబాటు. సంపాదనకోసం కూడా పుడుతుంటాయి. అధికారంలోకి వచ్చే పార్టీలు పట్టుమని పది కూడా ఉండవు. కానీ.. బరిలోకి దిగే రాజకీయ పార్టీలు మాత్రం బోలెడుంటాయి. వీటికి పార్టీ అనేది ఒక వ్యాపారం. ఎన్నికలు అనేవి వ్యాపార సీజన్. ఆ సీజను రాగానే.. ఎన్నికల గోదాలోకి దిగి, ఆ మిషపై చందాలు వసూలు చేసుకుని.. అందులో కొంత నామ్‌కే వాస్తేగా ఖర్చు పెట్టి మిగిలిన సొమ్ము దాచుకుంటాయి.

అచ్చంగా  ఈ పార్టీల గాటన కట్టేయలేం గానీ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి.. తెలుగుదేశం పార్టీ బాగానే మిగిల్చుకుంది. ఎన్నికలు ముగిసే నాటికి పెట్టిన ఖర్చులు పోగా.. ఆ పార్టీ.. ఏకంగా 155 కోట్లు మిగలబెట్టుకుంది. ఆ విషయంలో మాత్రం వైకాపా వెనుకబడింది. వారికి మిగిలింది 138 కోట్లే.

కానీ ఎన్నికల సమయంలో విరాళాలు పొందడంలో మాత్రం వైకాపానే ముందుంది. వైకాపా అధికారంలోకి రాబోతున్నదని.. విరాళాలు ఇచ్చే స్థాయిగల పెద్దలందరికీ ముందే అర్థమైపోయియందో ఏమో గానీ.. తెలుగుదేశానికి చందాలు పలచబడ్డాయి. ఎన్నికల ప్రకటన తర్వాత.. వైకాపాకు 221 కోట్ల చందాలొస్తే, తెలుగుదేశానికి వచ్చింది 131 కోట్లు మాత్రమే. కాకపోతే.. ప్రకటనకు ముందు నాటికి.. తెదేపా వద్ద 102 కోట్ల నిల్వ నిధులు ఉన్నాయి గనుక.. మొత్తంగా కలిపి వాళ్లు ఎన్నికలు ముగిసేనాటికి 155 కోట్లు వెనకేసుకోగలిగారు. ఎన్నికలకు ముందు వైకాపా వద్ద ఉన్నది 74 లక్షలు మాత్రమే.

ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు. అధికారం దక్కకపోయి ఉండొచ్చు. కానీ, మొత్తానికి ఎన్నికలు అనేది తెలుగుదేశానికి చాలా లాభసాటి బేరంగానే ఉంది.