పౌరసత్వ సవరణల చట్టం గురించి మోడీ ప్రభుత్వం గప్ఫాలు కొట్టుకుంటూ ఉంది. ఇదో చారిత్రక ఘట్టం అంటూ ఉంది. తామేం చేసినా మొదట్లో చరిత్రాత్మకం, చారిత్రకం అంటూ.. మోడీ అండ్ కో ఊదేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది వరకూ అన్నీ అలాగే జరిగాయి.
ఇక ఇప్పుడు పౌరసత్వ చట్టం సవరణల బిల్లును మోడీ ప్రభుత్వం ఎంచక్కా ఉభయ సభలనూ దాటించేయగలదేమో కానీ, ఈ బిల్లు కోర్టులో నిలబడదు అని విపక్షాలు అంటున్నాయి.ఉభయ సభల్లో బలాలను బట్టి ఈ చట్టం తీసుకొచ్చినా.. దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్, వామపక్షాలు అంటున్నాయి.
ఇది రాజ్యాంగ సవరణ కాదని, కేవలం బిల్లు-చట్ట సవరణ మాత్రమే అని ఆ పార్టీల నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ బిల్లు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ బిల్లులో మత ప్రాతిపదికను పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ భావనకు విరుద్ధం అని వారు వివరిస్తున్నారు.
వివక్షాపూరితంగా, విబేధాలను సృష్టించేలా ఈ బిల్లు ఉందని, ప్రత్యేకించి మత ప్రాతిపదికన పౌరసత్వాలను ఇచ్చేలా ఇందులో పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని లాయర్లు అయిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
న్యాయసమీక్షలో ఈ బిల్లు నిలిచే అవకాశమే లేదని వారు ధీమాగా చెబుతున్నారు. మరి మోడీ, అమిత్ షాలేమో అద్భుతం చేశామని అంటుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది కోర్టులో నిలబడే ప్రసక్తే లేదని అంటున్నారు.