జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ముందు ఏపీ నుంచి గెలిచిన 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యే ఎంత? అని ప్రశ్నించారు ఈ మధ్యనే. 'వాళ్లెంత.. వాళ్ల బతుకులు ఎంత?' అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మీద పవన్ కల్యాణ్ అలా పరుష వ్యాఖ్యలు చేశారు. వారికి ఓటేసి గెలిపించిన కోట్లాది మంది ప్రజలను కూడా పవన్ కల్యాణ్ అలా కించపరిచారు. ఇలాంటి వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్ చేత ఈలలు వేయించగలరేమో కానీ, సగటు ప్రజలకు ఇలాంటి మాటలతో పవన్ చాలా దూరం అయిపోతూ ఉన్నారు. అది గ్రహించే స్థితిలో ఆయన లేరనుకోండి.
ఆ సంగతలా ఉంటే.. వాళ్లెంత, వాళ్ల బతుకెలెంత అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే,వీధుల్లో తిరుగుతూ ఉన్నారు.అసెంబ్లీలో పవన్ కల్యాణ్ తన వాయిస్ వినిపించలేకపోతూ ఉన్నారు. వాళ్లు సభలో ఉంటే, తను వీధుల్లో ఉండాల్సి వస్తోంది.. కాబట్టి పవన్ కల్యాణ్ కు వాళ్లేంటో, వాళ్ల బతుకులు ఎంతో అర్థం అయి ఉండాలి.
ఇక మరోవైపు జనసేన పార్టీ వీరాభిమానులు మరో రకంగా పవన్ గొప్పదనాన్ని చెబుతూ ఉన్నారు. పవన్ కల్యాణ్ అంటే జగన్ ప్రభుత్వానికి భయమని, అందుకే ఆయనను అసెంబ్లీలోకి రానివ్వడం లేదని.. వారు సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆనందం పొందుతూ ఉన్నారు.
వీరి అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి 'ఇల్లిటరేట్స్' అంటూ ఒక కామెంట్ చేశాడు. బహుశా వర్మ కామెంట్ కు పవన్ కల్యాణ్ ప్యాన్స్ న్యాయం చేస్తున్నట్టుగా ఉన్నారు.