వెయ్యి మందికి పైగా మరణించిన గోద్రా మారణకాండ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి క్లీన్ చిట్ లభించింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా గోద్రా అల్లర్లను చాలా ఆర్గనైజ్డ్ గా చేయించారనే ఆరోపణలు మోడీ మీద వినిపించాయి.
అభియోగాలపై నియమితమైన జస్టిస్ నానావతి- మెహతా కమిషన్ ను గుజరాత్ అసెంబ్లీ ముందుకు తెచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఐదేళ్ల కిందటే ఆ కమిషన్ తన రిపోర్టును ఇవ్వగా.. దాన్ని అసెంబ్లీకి తాజాగా సమర్పించింది గుజరాత్ ప్రభుత్వం.
గోద్రా అల్లర్లను ఒక పథకం ప్రకారం సాగించారని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని అప్పటి మోడీ ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ గా అల్లర్లను సాగించిందనే ఆరోపణలున్నాయి. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవని ఈ కమిషన్ పేర్కొంది.
సబర్మతీ ఎక్స్ ప్రెస్ లో కరసేవకులు ప్రయాణిస్తున్న బోగీలకు నిప్పు పెట్టడంతో గుజరాత్ లో మతకలహాలు రేగాయి. బోగీల్లో ఉన్న యాభై తొమ్మిది మంది కరసేవకులు సజీవ దహనం అయ్యారు రైలు బోగీల దగ్ధం అనంతరం.. అల్లర్లు జరిగాయి.
ఆ అల్లర్లలో దాదాపు వెయ్యి మంది మరణించారు. వారిలో మెజారిటీ మంది ముస్లింలే ఉన్నారు. ఆ అల్లర్ల అనంతరం మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మోడీని గుజరాత్ సీఎంగా తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఆయనకు అండగా నిలబడింది.
విచారణకు కమిషన్ ఏర్పడింది. అది సుదీర్ఘ విచారణ అనంతరం తన రిపోర్టును సమర్పించింది. అసెంబ్లీలో దాన్ని వివరిస్తూ.. మోడీకి క్లీన్ చిట్ దక్కిందని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.