అభివృద్ధి పథకాల పేరుతో ఏపీలో అప్పుల కుప్ప పేరుకుపోతోందంటూ విమర్శలు చేస్తున్నవారికి మాటలతో కాకుండా.. చేతలతో సమాధానం చెబుతున్నారు సీఎం జగన్. గతంలో వ్యవస్థాగతమైన లోపాలతో వృథాగా పోతున్న రాయితీలకు కళ్లెం వేసే పనిలో పడ్డారు. సామాజిక పింఛన్లను కరెంటు బిల్లులకు, పిల్లల ఐటీ రిటర్న్స్ లకు లింక్ పెడుతూ తీసుకున్న నిర్ణయంతో చాలావరకు కట్టడి జరిగింది. అదే సమయంలో నిజమైన లబ్ధిదారులకు మేలూ జరిగింది. ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ వినియోగంలో అలాంటి సంచలనానికే తెరతీశారు సీఎం జగన్.
ఇప్పటివరకూ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. ఇకపై వాడుకున్న విద్యుత్ కి నేరుగా ప్రభుత్వమే వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తుంది. ఈ నగదుతో రైతులు విద్యుత్ బిల్లులు కడతారు. అంటే ఎవరు ఎంతవాడుకున్నారు, ఎవరికి ఎంత లబ్ధి చేకూరింది, ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయనే విషయాలు ఇక నుంచి పక్కాగా తేలిపోతాయి.
ఉచిత వృథాకు పూర్తిస్థాయిలో కళ్లెం పడుతుంది.ఈమేరకు వ్యవసాయ విద్యుత్ కు నగదు బదిలీ పథకం అమలు కోసం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల మంది రైతుల తరపున 8400 కోట్ల రూపాయలు విడుదల చేస్తోంది. అంటే సగటున ఒక్కో రైతు ఏడాదికి 46,666 రూపాయల విద్యుత్ వినియోగిస్తున్నారనమాట. దీంట్లో దాదాపు 15శాతం దుర్వినియోగం అవుతుందన్న అపవాదు ఉంది. అర్హత లేకపోయినా కొంతమంది కిందిస్థాయి సిబ్బంది చేతులు తడిపి ఉచిత విద్యుత్ ని వాడుకుంటున్నారు, మరికొన్నిచోట్ల అర్హత ఉన్న రైతులు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అవ్యవస్థలన్నీ ఇప్పుడు సెట్ అవ్వబోతున్నాయి.
విద్యుత్ నగదు బదిలీ కోసం రైతుల పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. నెలవారీగా డిస్కంలు రూపొందించిన బిల్లుల మేరకు ఇంధన శాఖ ఆమోదంతో ఆర్థిక శాఖ.. రైతుల ఖాతాలో సొమ్ము జమచేస్తుంది. ఈ సొమ్ము రైతు ప్రమేయం లేకుండానే విద్యుత్ కంపెనీల ఖాతాల్లోకి వెళ్తుంది. అంటే ప్రతి నెలా ఏ రైతు ఎంత విద్యుత్ వాడారు, వారికి ఎంత సొమ్ము జమైంది అనే విషయాలు క్లారిటీగా తెలుస్తాయి.
ఎప్పటిలాగే రైతులు ఉచిత విద్యుత్ వాడుకుంటారు, బిల్లు వచ్చినా తన సొంత డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. రైతుకి ప్రభుత్వం నుంచి తనకు ఎంత సాయం అందుతుందనే విషయం తెలుస్తుంది. రైతు బిల్లులు కడతారు కాబట్టి, విద్యుత్ అంతరాయాలపై సిబ్బందిని ప్రశ్నించే హక్కు ఉంటుంది. కంపెనీలు కొనుగోలు చేసే విద్యుత్ కి సంబంధించి వినియోగం, వృథా.. తదితర లెక్కలన్నీ స్పష్టంగా బైటపడతాయి. వృథాకి అడ్డుకట్ట పడుతుంది.
ఈ ఏడాది చివరిలోగా కనీసం ఒక జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో దీన్ని అమలులోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచన. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఆనాడు వైఎస్ సంచలన నిర్ణయం తీసుకుంటే.. దీన్ని క్రమబద్ధీకరించే దిశలో ఆయన తనయుడు జగన్.. మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.