ఇప్పటి వరకూ కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన వివిధ దేశాల్లో ఆ వైరస్ చాలా వరకూ నియంత్రణలోకి వచ్చింది. కొద్ది మేర ఇంకా చాలా దేశాల్లో కేసులు నమోదవుతున్నా.. పీక్ స్టేజ్ నుంచి వాటిల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతుబట్టని ఈ వైరస్ ఇండియాలో మాత్రం ఇంకా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతూ ఉంది.
ఇప్పటి వరకూ కరోనాపై జరిగిన వివిధ అధ్యయనాలు చెప్పిన మాటల్లో ఒకటి.. 75 శాతం రికవరీ రేటు సాధ్యమయ్యాకా కరోనా తగ్గుముఖం పడుతుంది అనేది. ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టిన వివిధ దేశాల్లో 75 శాతం రికవరీ తర్వాత పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. ఇండియాలో రికవరీ శాతం 75 దాటి రోజులు గడుస్తున్నాయి. ప్రస్తుతం రికవరీ పర్సెంటేజ్ 77 అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే గత వారంలో కరోనా కేసులు కొత్త పీక్స్ కు చేరాయి. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 80 వేల స్థాయికి చేరింది. బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో కూడా కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా.. ఇండియాలో మాత్రం వైరస్ ఇన్ఫెక్షన్స్ నంబర్ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్త కేసులకూ- రికవరీ కేసులకు వ్యత్యాసం కూడా పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల లోడ్ పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలను దాటినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
గత కొంత కాలంగా ప్రతి రోజూ కరోనా కారణంగా 800 నుంచి వెయ్యి మంది వరకూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరిలో 60 యేళ్ల వయసు దాటిన వారి శాతం 51గా ఉంది. 45 నుంచి 59 యేళ్ల వారి శాతం 36గా ఉంది. 26నుంచి 40 యేళ్ల వారి శాతం 11గా ఉంది. 14 నుంచి 25 వారి శాతం ఒక్కటిగా, అంతలోపు వయసు వారి శాతం ఒకటిగా ఉంది.