కొన్ని చేష్టల గురించి వింటుంటే మనం ఇంకా అనాగరిక సమాజంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది. నెలసరి లాంటి వాటిపై పురాతన ఆలోచనలతోనే మహిళలను చూడటం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. గుజరాత్‌లోని భుజ్‌లో ‘సహజానంద్ గర్ల్స్ ఇన్‌స్టిట్యూట్’లో విద్యార్థినులతో అధ్యాపకులు వ్యవహరించిన తీరు…థూ, ఛీ అని అసహ్యించుకునేలా చేసింది. నెలసరి సమయంలో హాస్టల్ వంట గదిలోకి వచ్చారన్న అనుమానంతో 68 మంది విద్యార్థినుల లోదుస్తులు విప్పించి పరిశీలించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
నెలసరి అనేది మహిళలకు సంబంధించి ప్రకృతి ధర్మం. సృష్టికి మూలమైన మాతృమూర్తి శరీరంలో జరిగే ప్రక్రియే నెలసరి. దాని గురించి తెలిస్తే గౌరవించాలి, తెలియకపోతే మౌనం పాటించాలి. అంతేగానీ, ఇలాంటి వికృత ఛేష్టలేంటి? భుజ్‌లో స్వామినారాయణ్ మందిర్ సభ్యులు నడిపే ఈ కళాశాలను 2012లో ఏర్పాటు చేశారు. 1 నుంచి 12వ తరగతి దాకా క్లాసులున్నాయి. కాలేజీలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 68 మంది హాస్టల్‌లో ఉంటున్నారు.
నెలసరి సమయంలో వారి కదలికలపై కాలేజీ యాజమాన్యం తీవ్ర ఆంక్షలు విధించడం ఏమిటో అర్థం కావడం లేదు. నెలసరి సమయంలో విద్యార్థినులు మిగతా విద్యార్థినులను తాకకూడదని, హాస్టల్ వంటగదిలోకి వెళ్లకూడదని, ఇతర విద్యార్థులతో కలిసి భోంచేయకూడదని, ప్రాంగణంలో ఉన్న స్వామినారాయణ్ మందిర్‌కు వెళ్లకూడదని ఆంక్షలు విధించడం ఏ ధర్మమో? చదువంటే అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని పెంపొందించడం. విద్యాలయాలంటే జ్ఞానాలయాలని అర్థం. మరి ఈ కాలేజీలో విద్యార్థినులతో అనుసరిస్తున్న విధానాలు…అజ్ఞానం వైపు నడిపించేలా ఉందని అనుమానం కలుగుతోంది.
కాగా ఈ ఘటనపై విచారణకు కచ్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ దర్శన ఢోలాకియా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ ట్రస్టీ హిరానీ చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) కూడా ఈ ఘటనపై స్పందించి విచారణ కమిటీని నియమించింది.