పంజాబ్ కాంగ్రెస్ లో రేగిన రచ్చ ఈ నాటిది కాదు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ లోకి చేరి వచ్చిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్యన విబేధాలు రచ్చకు ఎక్కి చాలా కాలం అయ్యింది.
కొన్నాళ్లు పాటు బహిరంగంగా విమర్శించుకోవడానికి వీరు వెనుకాడారు. పరస్పరం గౌరవముందని ప్రకటించుకున్నారు. అయితే వీరి ఆధిపత్య పోరు క్రమక్రమంగా పతాక స్థాయికి చేరుకుంది. ఈ రచ్చ ఇన్నాళ్లూ ఒక ఎత్తు కానీ, త్వరలోనే పంజాబ్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ఈ గొడవకు ఒక క్లైమాక్స్ ఇవ్వడానికి అధిష్టానం పూనుకున్నట్టుగా ఉంది.
అందుకోసమని వరసగా అమరీందర్, సిద్ధూలతో చర్చలు జరుపుతూ ఉంది. అమరీందర్ ని పిలిపించుకుని మాట్లాడారు సోనియా. ఇక సిద్ధూ వెళ్లి ప్రియాంక, రాహుల్ లతో సమావేశాలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఒక రాజీ ఫార్ములా రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
ఆ రాజీ ఫార్ములా ప్రకారం.. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ కొనసాగనున్నారట. వచ్చే ఎన్నికలకుకూడా కెప్టెన్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. సిద్ధూకు పార్టీ పరంగా ప్రాధాన్యతను ఇవ్వనున్నారని తెలుస్తోంది. సిద్ధూను పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలున్నాయని, సిద్ధూకు తోడు పీసీసీ కి ఇద్దరు డిప్యూటీ ప్రెసిడెంట్లు ఉంటారని సమాచారం. ఈ మేరకు ఒక రాజీ ఫార్ములాను తయారు చేసిందట కాంగ్రెస్ అధిష్టానం.
అయితే సిద్ధూకు మంత్రిగా ప్రాధాన్యత దక్కడాన్నే అమరీందర్ సహించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా సిద్ధూకు పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఆయన సహిస్తాడా? అనేది శేష ప్రశ్న. కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఇప్పటి వరకూ ఈ ప్రపోజల్ ను అధికారికంగా ప్రకటించి, అమలు చేయలేదు. ఇప్పటి వరకూ ఈ మేరకు ఒక ప్రతిపాదన అయితే రెడీ అయ్యిందని సమాచారం.