జాతిపిత మహాత్మా గాంధీజీ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని ఎందుకు చెప్పారో ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతోంది. ఎందుకంటే చెడు చూసి తట్టుకునే శక్తి భవిష్యత్ తరాలకు ఉండదని ఆయన ఏనాడో ఊహించినట్టున్నారు.
భవిష్యత్ భారతావని ఇంతగా పతనమవుతుందని బహుశా ఆ మహాత్ముడు ఊహించిన దానికంటే ఎక్కువే నష్టం జరిగినట్టుంది. తాజాగా కర్నాటక విధాన పరిషత్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.
కర్ణాటక విధానపరిషత్‌లో మంగళవారం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఏకంగా పరిషత్ డిప్యూటీ ఛైర్మన్ ధర్మ గౌడను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. కాంగ్రెస్ సభ్యులను అడ్డుకునేందుకు బీజేపీ సభ్యులు యత్నించారు.
దీంతో సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం బాహాబాహీకి దిగారు. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంలో సభలో అసలేం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితి. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడమే వివాదానికి కారణమైంది.
బీజేపీ, జేడీఎస్‌లు ఛైర్మన్‌ను అక్రమంగా ఆ స్థానంలో కూర్చోబెట్టాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీ, జేడీఎస్‌లు రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడ్డాయని, తప్పును సరిదిద్దేందుకే ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది.
పరిషత్‌లో సభాధ్యక్ష స్థానాన్ని దక్కించుకుని అధికార పక్షానికి దీటైన సమాధానం ఇవ్వాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అయితే అధికార పక్షమైన బీజేపీని అడ్డుకోవాలంటే జేడీఎస్ సహకారం తప్పనిసరి.
ప్రస్తుత పరిస్థితుల్లో జేడీఎస్ సభ్యుల నుంచి మద్దతు లభిస్తే తప్ప అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడే అవకాశం కాంగ్రెస్‌కు ఉండదు. మైత్రి సర్కారు సమయంలో పరిషత్ అధ్యక్ష స్థానాన్ని తమకు ఇవ్వాలని జేడీఎస్ పట్టుబట్టినా కాంగ్రెస్ నిరాకరించింది.
ఈ నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోయిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్‌పై కోపంగా ఉన్నారు. కాంగ్రెస్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించి మంచి సమయం రాదని ఆయన భావిస్తున్నారని తెలిసింది. దీంతో పరిషత్‌లో తమకు చుక్కెదురవుతుందని ఆందోళనగా ఉన్న కాంగ్రెస్ అనూహ్య పరిణామాలకు పాల్పడిందని చెప్పొచ్చు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ మాట్లాడుతూ ధర్మగౌడను చట్టవిరుద్ధంగా చైర్‌లో కూర్చోబెట్టారన్నారు. అందుకే అతన్ని లాక్కెళ్లామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ లేహర్ సింగ్ సిరోయా మాట్లాడుతూ.. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గూండాల్లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలి చరిత్రలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదన్నారు. కాగా కర్నాటక విధాన పరిషత్‌లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించి దృశ్యాలు చానళ్లలో ప్రసారం కావడంతో …యావత్ లోకమంతా ముక్కున వేలేసుకొంది. ఇలాంటివి చూడలేం అంటూ ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.