కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత కపిల్ సిబల్ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇక ఎంత మాత్రం ప్రత్యామ్నాయ పార్టీ కాదంటూ సిబల్ డేంజర్ బెల్ మోగించారు.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ దయనీయ స్థితిపై సిబల్ కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాల్ని వెల్లడించారు.
బిహార్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదన్నారు. బిహార్‌లో ఆర్జేడీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించారన్నారు.
గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి రెండు శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోలేని కాంగ్రెస్.. ఇకపై చేసుకుంటుందని ఎలా ఆశించగలమంటూ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి తన సమస్యలేంటో తెలుసని.. అయినా, వాటి పరిష్కారాలను గుర్తించడానికి ఎవరూ ఇష్టపడడం లేదని సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే.. పార్టీ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుందన్నారు. అలాంటి దుస్థితిలో పార్టీ ఉందన్నదే తమ ఆవేదనగా ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీలో కీలక పాత్ర పోషించే ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ) నామినేటెడ్ బాడీ కావడమే పార్టీ దుస్థితికి కారణమని సిబల్ అన్నారు. సీడబ్ల్యూసీ ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీలో ‘నామినేటెడ్’ సంస్కృతి పోవాలన్నారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు, దాని పర్యవసనాల్ని చూడాల్సి వచ్చిందన్నారు.
తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వేదిక పార్టీలో లేకపోవడంతో ఇలా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు. తాను కాంగ్రెస్ వ్యక్తినని.. భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో కొనసాగుతానని సిబల్ స్పష్టం చేశారు. ప్రజలు ఇక మీదట పార్టీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదని, పార్టీయే ప్రజల వద్దకు వెళ్లాలని సిబల్ స్పష్టం చేశారు.