కడప రిమ్స్ వైద్యకళాశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఏకంగా 50 మంది వైద్య విద్యార్థులు కరోనా బారిన పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ ఎన్టీఆర్ వర్సిటీ నేతృత్వంలో వైద్య విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా, మూడో వంతు విద్యార్థులు మహమ్మారి బారిన పడడం గమనార్హం.
ఇదిలా ఉండగా మంగళవారం 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వుంది. జలుబు, దగ్గు, జ్వరం తదితర సమస్యలతో బాధ పడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయగా… షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. వీరిలో 50 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరికొందరు విద్యార్థుల వైద్య నివేదికలు రావాల్సి వుంది.
ఈ నేపథ్యంలో రిమ్స్‌లో ఆందోళన తలెత్తింది. విద్యార్థుల భవిష్యత్‌ను తేల్చే పరీక్షలు కావడంతో సహజంగానే వారిలో భయాందోళన నెలకుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలని ఎన్టీఆర్ వర్సిటీని రిమ్స్ వైద్యకళాశాల యాజమాన్యం కోరింది.
దీనిపై ఎన్టీఆర్ వర్సిటీ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకుంది. పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు కరోనా బారిన పడడంపై కడప జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.