గతంలో టెన్త్ పరీక్షలు, ఇంటర్ పరీక్షల సమయంలో నారా లోకేష్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పరీక్షలు పోస్ట్ పోన్ చేయించి పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు. ఆ అభిషేకాలు సరిపోయినట్టు లేదు, ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు లోకేష్. పిల్లలకు సెలవలు కావాలంటున్నారు. కనీసం తల్లిదండ్రులు కూడా ఆ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ లోకేష్ కి మాత్రం సెలవలు కావాలట.
ప్రభుత్వం సెలవలు ఇస్తే, ఎందుకంటారు? ఇవ్వకపోతే ఎందుకివ్వడంలేదంటూ ఇదిగో ఇలా గోల చేస్తారు. రెండిటికీ లోకేష్ సిద్ధం, ఇప్పుడిలా ఆయనకు మరో అవకాశం వచ్చింది అంతే.
తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు నెలాఖరు వరకు సెలవలు ప్రకటించింది. అక్కడ తల్లిదండ్రులు శెలవులు వద్దంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సెలవలెందుకిచ్చారంటూ ఆందోళనబాట పట్టాయి. పబ్బులు, క్లబ్బులకు సెలవు లేదు కానీ స్కూళ్లకు ఎందుకు సెలవలు అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం.. పిల్లలను స్కూళ్లకు దూరం చేయడం సరైన నిర్ణయం కాదంటోంది. ఈ నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంటే, డైరెక్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ అని సీఎం జగన్ ప్రత్యక్ష తరగతులకే మొగ్గు చూపారు. తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు ప్రభుత్వం సిద్ధపడినా, ఏపీలో మాత్రం అలాంటి ప్రయోగం చేయదలచుకోలేదు జగన్. పరిస్థితి నిజంగానే చేయి దాటే పరిస్థితి వస్తే కచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మరీ సంక్రాంతి సెలవల తర్వాత స్కూళ్లు ప్రారంభించారు.
లోకేష్ కి ఏం కావాలి..?
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏనాడూ ప్రతిపక్షాలు గౌరవించలేదు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకోడానికి అప్పట్లో స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకున్నారు, ఆ తర్వాత నిజంగానే కేసులు పెరిగి సమయంలో ఎన్నికలు జరిపించుకుని బొక్క బోర్లా పడ్డారు. కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే తమ చేతిలో మనుషులతో ఇలాంటి జిమ్మిక్కులన్నీ చేయించారు చంద్రబాబు.
ఇప్పుడు ఏపీలో స్కూళ్లు నడవడం వీరికి కంటగింపుగా మారింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. ఎప్పుడూ కరోనా పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికే 15సంవత్సరాలు పైబడిన పిల్లల్లో చాలా మందికి ఏపీలో తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. తల్లిదండ్రులకి, టీచర్లకి అందరికీ వ్యాక్లినేషన్ పూర్తయింది.
ఈ దశలో స్కూళ్లు మూసేసుకుని ఎన్నాళ్లు కాలక్షేపం చేయాలి..? అది సరైన విధానం కాదు అనుకునే ప్రభుత్వం స్కూళ్లకు సెలవలు ఇవ్వడంలో దూరదృష్టితో ఆలోచించింది. దీనికి లోకేష్ బొక్కలు వెదుకుతున్నారు. కేవలం సెలవల విషయాన్ని రాజకీయం చేయడం కోసమే లోకేష్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.