ఒకవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తి విషయంలో ఇంకా అనేక సందేహాలు అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. ప్రజల్లో అవగాహన ఏ రోజుకారోజు పెరుగుతూ ఉందనుకున్నా, అదే సమయంలో ఏ రోజుకారోజు కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మాస్క్ లు ధరించడం పెరిగింది. సామాజిక దూరం మాత్రం కొశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఆ సంగతలా ఉంటే.. ఇంకా ఏయే మార్గాల్లో కరోనా వ్యాపిస్తోంది? అనేది మరో కీలకమైన సందేహంగా మిగిలింది. ఈ క్రమంలో బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ వైద్యుడు గిరిధర్ బాబు ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని తెలిపారు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీరును గమనిస్తే.. కొన్ని రకాలుగా ఆ వైరస్ స్ప్రెడ్ అవుతోందనేందుకు ఆధారాలు లేవని ఆయన ప్రకటించారు. ఉపరితలం ద్వారా, ప్లాస్లిక్, ఎన్వలప్స్, పేపర్ ల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతోందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని ఆయన అంటున్నారు. ఒకవేళ వీటి ద్వారా వ్యాప్తి చెందినా అతి తక్కువ శాతం అవకాశాలున్నాయని ఆ వైద్య నిపుణుడు చెబుతున్నారు.
ఒకవేళ వీటి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంటే..కేసుల సంఖ్య చాలా చాలా వేగంగా పెరిగేదని కూడా ఆ వైద్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. లాక్ డౌన్ మినహాయింపుల దగ్గర నుంచి అనేక మంది టేక్ అవే, హోం డెలివరీ ఫుడ్ తింటున్నారని, అలాగే పార్సిల్స్ డెలివరీ కూడా ఎక్కువగానే ఉందనే విషయాన్ని ఆ వైద్యుడు ప్రస్తావించారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కు మించి వేడి చేసే ఫుడ్ లో వైరస్ ఉన్నా ఆ వేడికి నశించి పోతుందని అన్నారు. కేక్స్, ఇతర ఫుడ్ ఐటమ్స్ ద్వారా కరోనా వ్యాపించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఉపరితలాలను టచ్ చేయడం ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతున్నట్టుగా లేదన్నారు. మాట్లాడేటప్పుడు పడే తుంపర్లు, ఇతర కరోనా సింప్టమ్స్ ద్వారానే ఎక్కువగా వైరస్ వ్యాప్తి జరుగుతోందని ఆ వైద్యుడు అంచనా వేస్తున్నారు.