కరోనా సెకెండ్ వేవ్ లో లాక్ డౌన్ ను ప్రజలు కూడా మరీ అంత సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి. కొన్ని రకాలుగా ప్రజలు జాగ్రత్త పడినా, మరి కొన్ని రకాలుగా మాత్రం లైట్ తీసుకున్నారు. ప్రత్యేకించి ఈ సారి అనవసరమైన ప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్లే ధైర్యం చాలా మంది చేయలేకపోయారు.
ఫస్ట్ వేవ్ గట్టిగా ఉన్న గత ఏడాది ఆగస్టులో కూడా ఏపీలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. ఒక్కో పెళ్లికి రెండు మూడు వందల మంది కూడా హాజరైన దాఖలాలున్నాయి. ఒకవైపు కరోనా కేసులు అప్పుడు పెద్ద సంఖ్యలోనే వస్తున్నా ప్రజలు లెక్క చేయకుండా శుభ కార్యక్రమాలకూ, విందులకూ, వినోదాలకు తిరిగారు.
అయితే సెకెండ్ వేవ్ లో ఈ తీరు మారింది. సెకెండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో మే నెలలో పెళ్లిళ్లు జరిగాయి. అయితే గతంలో లాగా ఈ సారి ప్రజలు పెద్ద ఎత్తున వాటికి హాజరు కాలేదు. ప్రభుత్వమే నియమాలను స్ట్రిక్ట్ చేసింది. అలాగే ప్రజలు కూడా ఈ సారి కరోనాకు భయపడ్డారు.
పెళ్లిళ్లకు పిలుపులు వచ్చినా చాలా మంది కదల్లేదు. ఎందుకొచ్చిందన్నట్టుగా కామ్ గా ఇళ్లలోనే ఉండిపోయారు. ఇలా పెళ్లిళ్లు, విందులు, వినోదాలపై కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం కనిపించింది. అయితే ఆ కార్యక్రమాలు ఏవీ ఆగలేదు. పరిమిత సంఖ్యలోని గెస్టులతో జరిగాయి.
అలాగే ఏ మాత్రం జ్వర లక్షణాలు, జలుబులు, ఇతర కరోనా లక్షణాలు తమలో కనిపించినా ఎవరికి వారే అలర్ట్ అయ్యారు. ఆ తరహా తీరుతో బయట వేరే వాళ్ల ఇళ్లకు వెళితే వారు భయపడతారు, అవమానిస్తారనే స్పృహ కూడా ప్రజల్లో వచ్చింది.
కరోనా లక్షణాలున్నా కొందరు షాపులకూ తిరిగారు, బయట తిరిగి ఉంటారు కానీ.. బంధువులు, స్నేహితుల ఇళ్లకు, పక్కింటికి వెళ్లడానికి కూడా భయపడ్డారు. ఈ తేడా కూడా సెకెండ్ వేవ్ లో బాగా కనిపించింది. పల్లెల్లో కూడా గత రెండు నెలలుగా పక్కింటికి వెళ్లేందుకు కూడా ప్రజలు ఆలోచనలో పడ్డారు.
అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చాలా పల్లెలకు కరోనా అటాక్ అయ్యింది, ఆ తర్వాత తగ్గిపోయింది. ఒక వేవ్ లా ఆయా పల్లెలకు సోకిన కరోనా.. అనేక మంది అంటుకుంది. ఆ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాకా పల్లెలు కాస్త రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడు మళ్లీ జనజీవనం పట్టాలెక్కుతూ ఉంది.
దేశ వ్యాప్తంగా కూడా నంబర్లు తగ్గుతూ ఉండటం, ఏపీలో కూడా కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గడం, కొత్త కేసులు వస్తున్నా.. అవి ఒకటీ రెండు జిల్లాల్లోనే మెజారిటీగా ఉండటంతో.. ఇప్పుడిప్పుడు ప్రజలు కాస్త స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నారు. చాలా మంది మునుపటి జాగ్రత్తలనే కొనసాగిస్తూ కనిపిస్తున్నారు. కొందరు మాత్రం ఇంకేముందిలే.. అనే పరిస్థితి పల్లెల్లో కనిపిస్తోంది.