వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశం కన్నా.. ఈ సారి ఛాన్సులు ఎవరికి దక్కుతాయనేది అత్యంత ఆసక్తిదాయకంగా మారింది. జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. జగన్ పెట్టిన గడువు ప్రకారం ఆరు నెలల్లో మంత్రి వర్గ పునర్వస్థీకరణ జరగాల్సి ఉంది. కాస్త అటూ ఇటూగా అయినా అది జరగొచ్చు.
ఈ నేపథ్యంలో ఆశావహుల జాబితా పెద్దదే. అయితే నేతల పనితీరును ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ పనితీరు ఆధారంగా ఎవరికి ఛాన్సులు ఉండవచ్చనే అంశంపై సహజంగానే చర్చ జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాబబుల్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ పేర్లలో ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరు కూడా ప్రముఖమైనది కావడం గమనార్హం.
తన పనితీరుతో కేవలం నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా, అవతలి వారికి కూడా బాగా పరిచయం అయ్యారు కేతిరెడ్డి. సోషల్ మీడియాలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక ట్రెండింగ్ పొలిటీషియన్! అనునిత్యం జనాల మధ్యన తిరుగుతూ.. ధర్మవరం వీధుల నుంచి పోస్ట్ అయ్యే కేతిరెడ్డి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతూ ఉంటాయి.
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈయన. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడ నుంచి పని చెప్పడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు డైరెక్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం ఏర్పడింది. చాలా ఆదర్శప్రాయమైన కార్యక్రమం ఇది.
ఇది సద్వినియోగం అవుతోంది కూడా. ఏవో సాంకేతిక కారణాలతో… తమకు పెన్షన్ రావడం లేదని చెప్పుకునే వయోవృద్ధుల నుంచి, తమకు ఫలానా ఫథకం లబ్ధి కలగడం లేదని చెప్పుకునే వారితో సహా.. స్థానిక సమస్యలను ప్రస్తావించే వాళ్లు బోలెడంత మందికి ఈ ఎమ్మెల్యే చేరువవుతూ ఉన్నాయి. మధ్యస్థ స్థాయి పట్టణాలు సమస్యలకు నెలవులుగా ఉంటాయి.
అలాంటి పట్టణాల్లో ఒక్కో వార్డుకు ఒక్కో రోజు ఎమ్మెల్యే స్వయంగా వెళ్తున్నాడంటే, వెళ్లగలుగుతున్నాడంటే అది మనకు చిన్న విషయం ఏమీ కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇలాంటి సమస్యలకు మొహం చాటేస్తూ ఉంటారు. కానీ కేతిరెడ్డి తీరు భిన్నంగా ఉంది. ఇదే ఆయన ఇమేజ్ ను పెంచుతూ ఉంది.
గుడ్ మార్నింగ్ ధర్మవరం వీడియోలు ఫేస్ బుక్ లో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని యూట్యూబ్ చానళ్లకు కూడా కేతిరెడ్డి వీడియోలు, ఆయనతో ప్రజలు సంభాషణలు జరిపే వీడియోల వరప్రదంగా మారిపోయాయి! పెయిడ్ పోస్టులు కాకుండా, వాస్తవ వీడియోలతో.. ప్రజలతో ఆయన సంభాషించే వీడియోలతో కేతిరెడ్డి పేరు మార్మోగుతూ ఉంది.
ఇక అనుచరవర్గానికి అండగా ఉండటంలో కూడా కేతిరెడ్డికి మంచి పేరుంది. అడ్డగోలుగా దోచుకొమ్మనే రకం కాదు, జన్మభూమి కమిటీలు, అధికార పార్టీ గ్రూపుల చింతే లేదు. ఇలాంటి నేపథ్యంలో కేతిరెడ్డిది మెరుగైన ట్రాక్ రికార్డు అవుతోంది. ఇప్పుడు జిల్లాలో కేతిరెడ్డికి సీనియర్ల నుంచి కూడా అంత పోటీ లేనట్టే.
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాత్రమే జిల్లా రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ గా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఉన్నా మంత్రివర్గం వైపు ఆయన ఆసక్తులు ఉండవు. ఇక మిగతా వారంతా తొలిసారి గెలిచిన వారే. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యే, 20 యేళ్ల నుంచి ధర్మవరం రాజకీయాల్లో గట్టిగా పని చేస్తూ ఉన్నారు. మరి నేపథ్యం మంతా వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా పేర్గాంచిన కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తనయుడిని జగన్ కేబినెట్ లో సభ్యుడిగా చేస్తుందేమో!