అంత వ‌ర‌కూ సంయ‌మ‌నం త‌ప్ప‌దు!

క‌రోనా…ఈ పేరు వింటేనే నిలువెల్లా వ‌ణికిపోయే ప‌రిస్థితి. ఎక్క‌డో చైనాలో పుట్టి, మ‌న గ‌డ‌ప వ‌ర‌కూ రాద‌నుకుంటే… అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో మ‌హ‌మ్మారి పంజా విసిరింది. కొంద‌రి ప్రాణాల‌ను…

క‌రోనా…ఈ పేరు వింటేనే నిలువెల్లా వ‌ణికిపోయే ప‌రిస్థితి. ఎక్క‌డో చైనాలో పుట్టి, మ‌న గ‌డ‌ప వ‌ర‌కూ రాద‌నుకుంటే… అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో మ‌హ‌మ్మారి పంజా విసిరింది. కొంద‌రి ప్రాణాల‌ను బ‌లిగింది. ఆ త‌ర్వాత త‌గ్గుముఖం ప‌ట్టింది. పీడ విర‌గ‌డైంద‌ని సంతోషిస్తున్న త‌రుణంలో, మ‌ళ్లీ త‌న విశృంఖ‌ల‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఈ ద‌ఫా మొద‌టి వేవే న‌యం అనేలా విరుచుకుప‌డింది. క‌రోనా బారిన ప‌డ్డ‌వాళ్లు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్ట‌మైంది. ఆక్సిజ‌న్ కోసం ఆస్ప‌త్రుల చుట్టూ ప‌రుగులు తీయాల్సిన దుస్థితి. అయిన‌ప్ప‌టికీ స‌మ‌యానికి ఆక్సిజ‌న్ బెడ్లు దొర‌క్క ఎంతో మంది ఆత్మీయుల‌ను పోగొట్టుకున్న ద‌య‌నీయ స్థితిని క‌రోనా సెకెండ్ వేవ్ మిగిల్చింది.

ముచ్చ‌ట‌గా మూడోసారి క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చింది. ర‌క‌ర‌కాల భ‌యాలు, హెచ్చ‌రిక‌లు. ఏది ఏమైన‌ప్ప‌టికీ రెండుమూడు రోజుల‌తోనే మ‌హ‌మ్మారి స‌రిపెట్ట‌డం సంతోషం. మ‌రీ ముఖ్యంగా మ‌నుషుల ప్రాణాలు తీయ‌డం చాలా చాలా త‌క్కువ‌. చెడులోనూ కాసింత ఊర‌ట క‌లిగించే అంశం.

ఈ నేప‌థ్యంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఊపు త‌గ్గింద‌ని అందుకు సంబంధించిన గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసులు, గ‌త కొంత కాలంగా వ‌చ్చిన‌ కేసుల‌తో పోల్చితే బాగా త‌గ్గుద‌ల క‌నిపిస్తోంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోజువారీ 3 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా 2,55,874 కేసులు న‌మోదు కావ‌డం విశేషం.

16 శాతం మేర కొత్త కేసులు త‌గ్గిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. 16 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పైన పేర్కొన్న‌ట్టుగా పాజిటివ్ కేసులు వ‌చ్చిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. గ‌తంలో 20 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు… 15.52 శాతానికి ప‌డిపోయిన‌ట్టు ఈ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. 

అంతేకాదు, కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలే ఎక్కువ‌గా ఉండ‌డం శుభ‌ప‌రిణామం. నిన్న 2,67,753 మంది కోలుకున్నారు.  ఫిబ్ర‌వ‌రి 15 నాటికి క‌రోనా కేసులు బాగా తగ్గుతాయ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వ‌ర్గాల అంచ‌నా. అంత వ‌ర‌కూ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ, సంయ‌మ‌నం పాటించ‌డం అంద‌రి బాధ్య‌త‌.