ప్ర‌భుత్వ క‌మిటీతో క‌య్య‌మా?

ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీతో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో కాకుండా క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ట్టు ఉద్యోగ సంఘాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. గ‌తంలో కేసీఆర్ స‌ర్కార్‌తో ఆర్టీసీ కార్మికులు ఢీకొని, 50 రోజుల‌కు…

ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీతో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణంలో కాకుండా క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ట్టు ఉద్యోగ సంఘాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. గ‌తంలో కేసీఆర్ స‌ర్కార్‌తో ఆర్టీసీ కార్మికులు ఢీకొని, 50 రోజుల‌కు పైబ‌డి స‌మ్మెబాట ప‌ట్టి చివ‌రికి ఎలా దిగొచ్చారో అంద‌రికీ తెలిసిందే. దాదాపు 13 ల‌క్ష‌ల మంది ఉన్నామ‌ని, తాము త‌ల‌చుకుంటే ప్ర‌భుత్వాల్ని ప‌డ‌గొట్ట‌గ‌ల‌మ‌నే అతిశ‌యం నుంచి ఉద్యోగులు బ‌య‌ట‌ప‌డితేనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాము గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు క‌లిగి ఉన్నామని, అలాగే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌మ‌నే ఏకైక ధీమాతో ఉద్యోగు లున్న‌ట్టు … వారి వ్య‌వ‌హార‌శైలిని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఇదే సంద‌ర్భంలో త‌మ‌కు ప్ర‌జా మ‌ద్ద‌తు క‌రువ‌వుతోంద‌నే వాస్త‌వాన్ని ఉద్యోగులు గుర్తించ‌లేకున్నారు. ప్ర‌జ‌ల‌తో త‌మ‌కు ప‌నిలేద‌ని, వారికే త‌మ సేవ‌లు అవ‌స‌ర‌మ‌నే భావ‌న ఉద్యోగుల్లో అంత‌ర్లీనంగా ఉన్న‌ట్టుంది. అందుకే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీతో చ‌ర్చ‌ల‌కు బ‌దులుగా క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ట్టు వారి ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌తిబింబిస్తున్నాయి.

ఉద్యోగుల అహంకార ధోర‌ణి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. అంతిమంగా ప్ర‌భుత్వ‌మే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సి వుంటుంద‌ని, అలాం టిది మాట్లాడుకుందాం రావాల‌ని పిలుస్తున్నా ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే 27 శాతం ఐఆర్ ఇవ్వ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఒక‌వైపు ఉద్యోగ సంఘాల నేత‌లు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నా, ప్ర‌భుత్వం మాత్రం సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నిన్న చ‌ర్చ‌ల కోసం ఆహ్వానించి, వారి రాక కోసం ఎదురు చూసి, ప్ర‌యోజ‌నం లేక‌పోయినా ఎక్క‌డా ఆగ్ర‌హానికి లోనుకాలేదు. ఇవాళ కూడా మ‌రోసారి మంత్రుల క‌మిటీ ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను ఆహ్వానించ‌డంతో పాటు వారి కోసం ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

తాము వెళ్లి చ‌ర్చించ‌కుండానే, అది చేస్తే వ‌స్తాం, ఇది చేస్తే వ‌స్తామ‌ని డిమాండ్స్ పెట్ట‌డం ప్ర‌జానీకానికి కోపం తెప్పిస్తోంది. ప్ర‌భుత్వం వాటిని ర‌ద్దు చేస్తే, ఇక చ‌ర్చ‌ల అవ‌స‌రం ఏంట‌నే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. కావున ఇరువైపుల నుంచి సానుకూల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తేనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని పౌర స‌మాజం చెబుతోంది. అలా కాకుండా తాము మాత్రం త‌గ్గేదే లేదంటే… అటు వైపు నుంచి కూడా అదే రీతిలో స్పంద‌న వ‌స్తే… ఇక ఎప్ప‌టికీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌నే వాస్త‌వాన్ని ఉద్యోగ సంఘాలు గ్ర‌హించాల్సి వుంది.