ఏపీలో పరీక్షల రద్దుకి ప్రధాన కారణం నారా లోకేష్. ఆయనకు తప్ప ఆ ఘనత ఇంకెవరికీ ఇవ్వడానికి లేదు. పనిగట్టుకుని మరీ విద్యార్థులతో కేసులు వేయించి, వారితో జూమ్ మీటింగ్ లు పెట్టి రెచ్చగొట్టి, ప్రభుత్వంపై కక్షగట్టి పరీక్షలు రద్దు చేయించారు లోకేష్. చంకలు గుద్దుకున్నారు. విద్యార్థులతో మామయ్య అనిపించుకున్నారు, పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఊరూ వాడా ఇది తన ఘనవిజయంగా డప్పు కొట్టించుకున్నారు. అనుకూల మీడియాలో ఆహా ఓహో అంటూ పొగిడించుకున్నారు.
కట్ చేస్తే.. అప్పుడు లోకేష్ కి అప్పుడు పాలాభిషేకాలు చేసినవారు సైతం, ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నారు. పరీక్షలు లేకుండా పాసయిన కరోనా బ్యాచ్ గా ముద్రవేయించుకుని ఎందుకూ పనికిరాకుండా పోతున్నారు. కావాలంటే ఈ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ డిగ్రీ క్వాలిఫికేషన్ పై విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో 2021 పాసవుట్ బ్యాచ్ కి ఎంట్రీ లేదట.
డిగ్రీయే కాదు, ఇంటర్, టెన్త్ బ్యాచ్ లది కూడా ఇదే పరిస్థితి. టెన్త్ అర్హతతో నియామకాలు చేపట్టే ఆర్మీ ఉద్యోగాల్లో కరోనా బ్యాచ్ కి అన్యాయం జరుగుతోంది. ఇంటర్ వెయిటేజీతో రాసే ఎయిర్ ఫోర్స్, నేవీ ఇతర ఉద్యోగాల్లో కూడా కరోనా బ్యాచ్ కు ఆఖరి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదంతా ఎవరి ఘనత? పరీక్షలొద్దంటూ పాస్ చేయించిన నారా లోకేష్ ఘనతే ఇది.
ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల సంగతి చెప్పేదేముంది. కరోనా బ్యాచ్ అంటే చాలు, మీకు అప్లికేషన్ పెట్టే అర్హతే లేదని మొహంమీదే చెప్పేస్తున్నారు. ఓవైపు కేరళ వంటి పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నా.. ఏపీలో మాత్రం ఎగ్జామ్స్ వద్దు అని ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఎన్నికలు వద్దన్న రోజుల్లో ప్రతిపక్షాలు కావాలంటూ పట్టుబట్టాయి. పరీక్షలు పెడతామంటే మాత్రం వద్దన్నాయి. కేవలం ప్రభుత్వంపై కక్షసాధింపు కోసమే ఇలా ప్రవర్తించాయి, విద్యార్థులను ఇరుకునపెట్టాయి.
లోకేష్ ఇప్పుడేమంటారు..?
ఇలాంటి నోటిఫికేషన్లు చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లోకేష్ ని కచ్చితంగా తిట్టుకుంటారు. పరీక్షలు లేకుండా పాసైనందుకు ఓ పది శాతం మంది సంతోషించొచ్చు. అదే సమయంలో అసలు మార్కులే లేకుండా అందరితో కలిపి ఒకే గాటన కట్టినందుకు మిగతా 90శాతం మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే సందర్భం ఇది.
ఇలాంటి నోటిఫికేషన్లు చూస్తే కరోనా టై్మ్ లో పాసైన విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి లోనై, అఘాయిత్యాలకు పాల్పడితే కచ్చితంగా ఆ పాపమంతా లోకేష్ కే చుట్టుకుంటుంది.