టోక్యో ఒలింపిక్స్ సెమిస్ లో భారత పురుషుల హాకీ టీమ్ ఓటమి పాలయ్యింది. బెల్జియం చేతిలో 5-2 గోల్స్ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. అయితే ఒలింపిక్స్ లో భారత జట్టు ప్రస్థానం ఇంతటితో అయిపోలేదు. భారత జట్టు కాంస్య పతకం పోరులో ఉంటుంది. మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్ లో విజేతగా నిలిస్తే.. భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో విజయంతో బెల్జియం ఫైనల్ కు చేరుకుంది.
సెమిస్ లో ఒక రకంగా పోరాడి ఓడిపోయింది భారత జట్టు. ప్రత్యేకించి ఆఖరి క్వార్టర్ వరకూ మ్యాచ్ టై గానే కొనసాగింది. ఒక దశలో 2-1తో లీడ్ లో నిలిచింది కూడా టీమిండియా. అయితే ఆ తర్వాత బెల్జియం జట్టు తన స్థాయికి తగ్గట్టుగా రాణించింది. మ్యాచ్ కు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన బెల్జియం జట్టు ఆదిలోనే గోల్ నమోదు చేసింది. తొలి నిమిషాల్లోనే బెల్జియంకు గోల్ లభించింది. అయితే ఆ తర్వాత భారత జట్టు ఊపు మీదకు వచ్చింది. వరసగా రెండు గోల్స్ సాధించి పై చేయి సాధించింది. తొలి సగం పూర్తవ్వడానికి కాస్త ముందు.. బెల్జియం రెండో గోల్ సాధించి స్కోరును సమం చేసింది.
మూడో క్వార్టర్ లో ఆట పోటాపోటీగా సాగింది. ఆ క్వార్టర్ లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే ఆఖరి క్వార్టర్ లో బెల్జియం గోల్స్ వర్షం కురిపించింది. ప్రత్యేకించి పెనాల్టీ కార్నర్ లను బెల్జియం సద్వినియోగం చేసుకుంది. అలాగే భారత డిఫెన్స్ ను బెల్జియం పదే పదే చేధించగలిగింది. బెల్జియం అటాక్ ను భారత బృందం ఆఖరి నిమిషాల్లో ఆపలేకపోయింది. పదే పదే పెనాల్టీని ఇచ్చుకుంది. మ్యాచ్ లో బెల్జియంకు ఏకంగా పదికి పైగా పెనాల్టీ అవకాశాలు దక్కాయి. వాటిల్లో చివరి క్వార్టర్ లో నమోదైన రెండు గోల్స్ తో బెల్జియం ఆటను తన ఆధీనంలోకి తీసుకుంది.
మూడో క్వార్టర్ వరకూ పోటాపోటీగా ఉన్న పరిస్థితి.. చివరి క్వార్టర్ లో బెల్జియం మ్యాచ్ లో తన మూడో గోల్ చేయడంతోనే సైకలాజికల్ గా భారత జట్టు ఒత్తిడికి లోనైంది. మూడో గోల్ తో మ్యాచ్ పై బెల్జియం తన పట్టును బిగించింది. ఆ తర్వాత పెనాల్టీ రూపంలోనే ఆ జట్టుకు నాలుగో గోల్ కూడా లభించింది. ఒక మ్యాచ్ ముగిసే ఆఖరి నిమిషంలో బెల్జియంకు ఫీల్డ్ గోల్ లభించింది. చివరి నిమిషాల్లో గోల్ కీపర్ బదులు ఫీల్డ్ ప్లేయర్ నే తీసుకుని ఆడింది టీమిండియా. బెల్జియంపై అటాక్ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం తో ఇండియా మరో గోల్ ఇచ్చుకుంది. దీంతో 5-2 గోల్స్ తో టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది.
దాదాపు 45 నిమిషాల ఆట వరకూ మ్యాచ్ లో ఆధిపత్యంలో, లేదా పోటీ ఇచ్చే స్థితిలో ఉండిన టీమిండియా.. ఆఖర్లో మాత్రం తడబడి చేతులెత్తేసింది. ఇలా 40 యేళ్ల తర్వాత ఒలింపిక్స్ లో హాకీ ఫైనల్ ఆడే అవకాశాన్ని భారత జట్టు కోల్పోయింది. ఇక కాంస్య పతకం పోటీలో టీమిండియా ఉంది. ఏ మాత్రం అంచనాలు ఆశల్లేకుండా ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు.. కనీసం కాంస్యం సాధించినా అద్భుతమే అవుతుంది.