తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని అక్కడి మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఏ మాత్రం లెక్క చేయడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డా? అయితే ఏంటట…అనే రీతిలో తాడిపత్రి మున్సిపల్ అధికారులు, సిబ్బంది తమ చర్యలతో చెప్పకనే చెప్పారు. తన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంతో పాటు సమావేశానికి గైర్హాజరు కావడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన నాటకీయ రీతిలో వినూత్న నిరసనకు దిగారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ తాడిపత్రి మున్సిపాలిటీలో చక్కటి డ్రామా చోటు చేసుకుంది.
ఏపీలో టీడీపీ దక్కించుకున్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి అనే సంగతి తెలిసిందే. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమని మండే పరిస్థితి. ఈ నేపథ్యంలో నేతల మధ్య వైరం అధికారులను ఇరకాటంలో పడేస్తోంది.
సోమవారం ఉదయం 10.30 గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్‌తో సహా అందరికీ సిబ్బందికి జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండురోజులు ముందుగానే మెసేజ్ పంపారు. సోమవారం రానే వచ్చింది. అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ సిబ్బందితో కలిసి కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్షా సమావేశం నిర్వహించారు.
ర్యాలీ అనంతరం కార్యాలయానికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది వస్తారనే ఉద్దేశంతో 12.30 గంటలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్ చాబర్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎమ్మెల్యేతో సమీక్ష అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లిపోయారు. అంతేకాదు, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళ్లారు. బాధ్యతలను ఇతరులకు బాధ్యతలు అప్పగించారని తెలియడంతో జేసీ మండిపడ్డారు. దీంతో అధికారులు కార్యాలయానికి వచ్చే వరకూ కదిలేది లేదంటూ కార్యాలయంలోనే తిష్టవేశారు.
సాయంత్రం 4.30 గంటలకు కొందరు అధికారులు జేసీ వద్దకు వెళ్లారు. అ అధికారుల నిబద్ధతను ప్రశంసిస్తూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వంగి నమస్కరిస్తూ తనదైన నటన ప్రదర్శించడం ఆకట్టుకుంది. తన ఆదేశాలను కాదని సిబ్బంది ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ 26 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.
కమిషనర్ వచ్చేదాకా రాత్రి కూడా కార్యాలయం లోనే బస ఏర్పాటు చేసుకుంటామని చైర్మన్ హెచ్చరించడంతో పరిస్థితి ఉత్కంఠకు దారి తీసింది. రాత్రికి అక్కడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఇదిలా ఉండగా తాడిపత్రి పురపాలిక కార్యాలయ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.