గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇళ్లకు ఇళ్లు చుట్టేస్తోంది. మొన్నటికిమొన్న మాదన్నపేటలో ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 28 మందికి కరోనా పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే తరహాలో మంగళ్ హట్ లో ఒకే ఇంట్లో 16 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
మాదన్నపేటలో పుట్టినరోజు వేడుక చేయడం వల్ల కరోనా వ్యాపించింది. అపార్ట్ మెంట్ లో జరిగిన ఓ చిన్న బర్త్ డే పార్టీకి వెళ్లిన కుటుంబీకులందరికీ కరోనా సోకింది. ఈసారి మంగళ్ హట్ లో ఓ కుర్రాడు చేసిన పని వల్ల 16 మంది కుటుంబ సభ్యులకు కరోనా వచ్చింది.
హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల్ని కుర్రాళ్లు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా రాత్రిళ్లు కూడా తిరుగుతుంటారు. ఈ కుర్రాడు కూడా అదే పనిచేశాడు. ఆంక్షల్ని పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి గంటల తరబడి కబుర్లు చెప్పాడు. షికార్లు చేశాడు. ఫలితంగా ఇతడికి కరోనా సోకింది.
కుర్రాడికి సోకిన కరోనా లక్షణాలు వెంటనే బయటపడలేదు. కానీ ఇతడి వల్ల అతడి కుటుంబంలో ఉన్న 57 ఏళ్ల కుటుంబ పెద్దకు కరోనా సోకింది. పెద్ద వయసు కావడంతో లక్షణాలు తొందరగా బయటపడ్డాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడు చనిపోయాడు కూడా. మొత్తంగా ఆ ఇంట్లో 27 మంది ఉంటారు. వీళ్లలో 16 మందికి కరోనా సోకింది. నిబంధనల్ని పట్టించుకోకుండా ఆ ఇంట్లో కుర్రాడు చేసిన పని వల్ల ఇప్పుడా కుటుంబం మొత్తం బాధపడుతోంది.
తెలంగాణలో నిన్న కొత్తగా 42 కరోనా కేసులు నమోదైతే.. అందులో 37 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోనివి. ఆ 37 కేసుల్లో 16 మంది ఈ మంగళ్ హట్ ప్రాంతంలో నివశిస్తున్న కుటుంబ సభ్యులే.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1551కు చేరుకుంది. 34 మంది మరణించగా.. 992 మంది డిశ్చార్జ్ అయ్యారు.