ఇప్పటిదాకా చెప్పిన కాంప్లెక్సులను అర్థం చేసుకోవడం సులభం. ఎందుకంటే అవి భార్యాభర్తలకు సంబంధించినవి. కానీ యిది తల్లి-పిల్లలకు సంబంధించిన సమీకరణం. దీనిలో అపశ్రుతులను హరాయించుకోవడం కష్టం. దైవానికి ప్రతిరూపమైన తల్లి కడుపున పుట్టిన పిల్లలపై హింస ప్రదర్శిస్తుందా అని తెల్లబోతాం. అది వాస్తవంగా జరిగినప్పుడు దానికి వేరే కారణాలు వెతుకుతాం. వివాహిత మహిళ ఎవరో ప్రియుణ్ని మరిగి, పిల్లలను కూడా చంపుకుంది అని రిపోర్టు చేసినప్పుడు – కాముకతకు అడ్డు వస్తారనే భయంతో.. అని పత్రికల వాళ్లు చేరుస్తారు. కాముకత కంటె అది భర్త మీద కోపంతో, కక్షతో, అతన్ని మానసికంగా హింసించాలనే లక్ష్యంతో అని అర్థం చేసుకోవాలని మెడియా కథ మనకు చెప్తోంది.
తనవరకు తను ఏం కావాలన్నా చేసుకోవచ్చు, ప్రాణం తీసుకోవచ్చు కానీ పిల్లలు ఉసురు తీయడానికి ఆమెకెక్కడ హక్కు వుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఒక మహిళ అలా అనుకోదు. తనలోంచి ఉద్భవించారు కాబట్టి, వాళ్లపై తనకై యావత్ హక్కులు వున్నట్లు భావిస్తుంది. ఆట్టే మాట్లాడితే భర్తకు కూడా లేవంటుంది. పిల్లలకు పెట్టినా, కొట్టినా అడిగే అధికారం ఎవరికీ లేదనుకుంటుంది. భర్త మీద కానీ, అత్త మీద కానీ, సమాజం మీద కానీ కోపం ప్రదర్శించవలసి వచ్చినపుడు పిల్లల్ని కొట్టే తల్లులు కోకొల్లలు. ప్రేమ లేదా అంటే ఉంటుంది. అది వేరే.
అలా కొట్టినపుడు అవతలివాళ్లు తగ్గుతారు. చాల్లే ఊరుకోమ్మా, పిల్ల చచ్చిపోతుంది అంటూ ఆమెను తిట్టడం మానేస్తారు. మొగుడు, అత్తమామలు కాళ్లబేరానికి వస్తారు. అలా రప్పించడానికి పిల్లల్ని సాధనంగా వాడుకోవడం తల్లికి తప్పుగా తోచదు. ఏడుస్తున్న పిల్లల్ని తర్వాత ఎలా సముదాయించాలో నాకు తెలుసులే అనుకుంటుంది. ఇదంతా పిల్లల మీద ద్వేషం కాదు. ఆ క్రమంలో పిల్లలకు హాని కలిగినా ఖాతరు చేయదు. ఆ పిల్లలు కలగడానికి కారకుడైన భర్త అడ్డుపడినా వినదు. అదీ వింత.
ఆడపిల్లకు కౌమారప్రాయం వచ్చినపుడు తల్లీకూతుళ్ల మధ్య గొడవలు చోటు చేసుకోవడం సాధారణమైన విషయం. ఇది హద్దుల్లో వున్నంతవరకు ఫర్వాలేదు కానీ, కొందరిలో శ్రుతి మించి, అమ్మాయి చెప్పినమాట వినని పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో వస్తూంటుంది. అసలు యిద్దరి మధ్య గొడవలు ఎందుకు రావాలి అనే ప్రశ్న వస్తుంది. దానికి కారణం అసూయ అంటారు – సైకాలజిస్టులు. నిజమా అని ఆశ్చర్యపడవద్దు. మనమంతా మానవులం. మనకు తెలియకుండా లోపల ఎన్నో పొరలు వుంటాయి.
కూతురు కాస్త పెద్దదయిన కొద్దీ తల్లికి ఎటెన్షన్ తగ్గిపోతుంది. ఆవిడ నలభైలలోకి వస్తూ వుంటుంది కాబట్టి, తన అందంపై తనకు నమ్మకం సడల నారంభిస్తుంది. అదే సమయంలో కూతురు ఛెంగుఛెంగున తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వుంటే యీవిడకు తెలియని అసూయ కలుగుతుంది. ‘ఏవిటా వేషాలు, కుదురుగా ఓ చోట ఉండలేవూ, పైట సర్దుకో. ఎవరైనా చూస్తే నన్ను తిడతారు.’ అంటుంది. ఎవరైనా కూతురి అందాన్ని మెచ్చుకుంటే సంతోషిస్తూనే, అలాటి మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నేను యింకా అంతకంటె అందంగా వుంటాను అనుకుంటుంది.
కొన్ని కేసుల్లో కూతురు యుక్తవయసుకి వచ్చినా ఆమె కంటె తల్లి ఎక్కువ ఆకర్షణీయంగా వుంటుంది. అపరిచితులైన మగవారు ఆమెతో మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అప్పుడు కూతురికి తల్లిపై అసూయ పుడుతుంది. ఇంత వయసు వచ్చినా యీ వేషాలేమిటి అంటూ తల్లి గురించి స్నేహితుల వద్ద, తన యీడువారి దగ్గర వ్యాఖ్యానిస్తుంది. తల్లి సోషల్‌గా వుండి, నలుగురిలో తిరుగుతూ పేరు తెచ్చుకుంటూ వుంటే కూతురితో మానసిక సమస్యలు తప్పవు. చెప్పిన మాట వినదు, ఎప్పుడూ చికాగ్గా వుంటుంది. ఒకవిధమైన యిన్‌సెక్యూరిటీతో ఎప్పుడూ తల్లితో పోట్లాడుతూ వుంటుంది. తల్లిని తనకు పోటీదారుగా చూస్తుంది.
కొన్ని కుటుంబాలలో యింటి యజమాని కూతురిపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తూ, ఆమె మాటకే విలువ యిస్తూ భార్యను తీసిపారేస్తూంటాడు. హేళన చేస్తూ వుంటాడు కూడా. అది భార్యకు కష్టంగా తోస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలలో తన మాటకు విలువ లేకపోవడం, కూతురి మాటే చెల్లడం చూసి భర్త ఆదరణ విషయంలో ఆమె కూతుర్ని పోటీదారుగా ఫీలవుతుంది. ఆమె కంటూ వేరే ఆదాయ వనరు లేనప్పుడు, భర్తదే మొత్తం పెత్తనం అయినప్పుడు యీ బాధ మరింతగా వుంటుంది. అందువలన అదను దొరికినప్పుడు కూతుర్ని అకారణంగా విమర్శిస్తూ, అనవసరంగా కట్టడి చేయాలని చూస్తుంది, దానితో కూతురికి శత్రువై పోతుంది.
మెనోపాజ్ సమయంలో కొందరు స్త్రీలకు మానసిక సమస్యలు కూడా వస్తాయి. అదే సమయంలో కూతురిపై అసూయ కూడా కలిగిందంటే సమస్య మరింత జటిలమవుతుంది. పాశ్చాత్యదేశాల్లో చాలామంది మహిళలు వివాహమైన తర్వాత కూడా తల్లలు తమ పట్ల అసూయ కనబరచారని ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మీకున్నన్ని అవకాశాలు మా టైములో మహిళలకు ఉండి వుంటే నేను యింకా మెరుగైన స్థితిలో ఉండేదాన్ని అనే ఫీలింగుతో తను సాధించినదానిని తల్లి తక్కువ చేసి మాట్లాడుతోందని వారు వాపోతున్నారు. నువ్వు ముందుకు సాగు, కానీ నన్ను దాటిపోయేటంతగా వెలిగిపోకు – అని తల్లులు కూతుళ్లకు చెప్తున్నట్లుందని వారి అభిప్రాయం. మన దేశంలో కొన్నాళ్లకు యీ పోలికా రావచ్చేమో.
ఈ సమస్యపై అరిగే రామారావు గారి “ఆడమనసు” అనే 1963 నాటి కథ వుంది. అయిదుగురు పిల్లలు పుట్టి మధ్యవయసుకి వచ్చిన తల్లి, పెద్దకూతురి అందాన్ని అందరూ మెచ్చుకోవడం చూసి అసూయపడుతుంది. అనవసరంగా తనను కోప్పడుతుంది. అంతలో ఆ అమ్మాయి చీర కట్టుకుంటే తక్కిన పిల్లలందరూ అచ్చు అమ్మలాగానే వుంది అనడంతో ఆ అందం తననుంచి వచ్చిందే అనే స్పృహ కలిగి, సిగ్గు పడి మర్నాడు కూతుర్ని అక్కున చేర్చుకుంటుంది.
దీనితో కాంప్లెక్సుల సీరీస్ ముగిస్తున్నాను. సైకో ఎనాలిసిస్‌పై ఆసక్తి కలిగినవారు చదువుకోవడానికి బోల్డంత వుంది. మొదట్లోనే చెప్పినట్లు ఈ పరిజ్ఞానం మనుష్యులను అర్థం చేసుకోవడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఉపకరిస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2020)
[email protected]