లాక్ డౌన్ విషయంలో ప్రతిసారి కేంద్రం కంటే ఒక అడుగు ముందే ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం ప్రకటించిన గడువు కంటే కాస్త ఎక్కువగానే లాక్ డౌన్ గడువును పెంచుతూ వచ్చారు. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది కానీ ఈ విషయంలో కేసీఆర్ ఎప్పుడో ఓ అడుగు ముందుకేశారు. 29 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. లాక్ డౌన్ -4 కు సంబంధించి కేంద్రం మరోసారి విధివిధానాలు రూపొందించింది. ఈ క్రమంలో కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు.
మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ వచ్చారు కేసీఆర్. అయితే ప్రస్తుతానికి అలాంటిదేం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో 2 వారాల పాటు గడువు ఉన్న నేపథ్యంలో.. ఈసారి ఇతర అంశాల్ని కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యమైంది ప్రజా రవాణా వ్యవస్థ.
వాస్తవానికి ఆర్టీసీ బస్సుల్ని పరిమిత సంఖ్యలో నడుపుకోవచ్చంటూ కేంద్రం ఇప్పటికే సూచనలు చేసినప్పటికీ, కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వలేదు. అయితే తాజాగా ఆర్టీసీకి అనుమతినిచ్చారు. రేపట్నుంచి (మంగళవారం) నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించిన విధివిధానాల్ని ఖరారు చేయబోతున్నారు. ఎన్ని బస్సులు తిప్పాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఈరోజు చర్చిస్తారు. దీంతో పాటు లాక్ డౌన్ కు సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలతో కేసీఆర్ మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది.
మరోవైపు జోన్ల విభజన, ప్రకటన అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అప్పగించిన నేపథ్యంలో… దీనిపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నారు కేసీఆర్. ఎందుకంటే కొన్ని జిల్లాల్ని గ్రీన్ జోన్లుగా ప్రకటించమని కేంద్రాన్ని ఎప్పట్నుంచో కోరుతోంది రాష్ట్రం. ఇప్పుడీ అధికారం రాష్ట్రాలకే రావడంతో.. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలంగామలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తిలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అటు మరో 25 జిల్లాలో గడిచిన 2 వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దీంతో ఈ ప్రాంతాలన్నింటిపై కేసీఆర్ చకచకా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా ఆంక్షల్ని విధించి, మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంతో పాటు బస్సుల్ని తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. మరోవైపు 29 వరకు ఉన్న లాక్ డౌన్ ను, కేంద్రం చెప్పినట్టు 31 వరకు పొడిగించే అవకాశం ఉంది.